ILT20 2025 Final : ఇంటర్నేషనల్ లీగ్ టీ20 విజేతగా దుబాయ్ క్యాపిటల్స్ నిలిచింది. ఫైనల్లో డెసర్ట్ వైపర్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వైపర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో దుబాయ్ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ ఉత్కంఠభరితమైన ఛేజింగ్ లో ఓ వివాదస్పదమైన నిర్ణయం కూడా ఉంది. అదేంటంటే?
ఆ ఔట్ వల్లే!
దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేస్తున్న 8వ ఓవర్లో ఆ జట్టు బ్యాటర్ పావెల్‌ను వైపర్స్ వికెట్ కీపర్ అజామ్ ఖాన్ స్టంప్ ఔట్ చేశాడు. పావెల్ ఔటైన సమయంలో వైపర్స్ టీమ్ సంబరాలు చేసుకుంది. అయితే పావెల్ స్టంప్ ఔటైనప్పుడు అజామ్ గ్లోవ్స్ స్టంప్స్‌కు సమానంగా ఉన్నాయని టీవీ అంపైర్ గమనించాడు. దీంతో ఆ బంతి నో బాల్‌గా ప్రకటించాడు. తదుపరి డెలివరీని ఫ్రీ హిట్ వచ్చింది. ఆ బంతిని సిక్సర్‌గా మలిచాడు పావెల్. అజామ్ ఖాన్ చేసిన ఈ తప్పు వల్ల మ్యాచ్ వైపర్స్ జట్టుకు దూరమైంది. ఈ మ్యాచ్‌లో పావెల్ 38 బంతుల్లో ఏకంగా 63 పరుగులు బాదాడు.
మ్యాచ్ విషయానికొస్తే
దుబాయ్ క్యాపిటల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓబెద్ మెక్ కాయ్ ధాటికి వైపర్స్ 34 పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. రహ్మానుల్లా గుర్బాజ్, అలెక్స్ హేల్స్ చెరో ఐదు పరుగులు చేసి మెక్ కాయ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యారు. మ్యాక్స్ హోల్టన్ (76), కెప్టెన్ శామ్ కరన్ (62*) జట్టును ఆదుకున్నారు. దీంతో వైపర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. దుబాయ్ క్యాపిటల్స్ బౌలర్లలో మెక్ కాయ్ 2, హైదర్ అలీ, సికందర్ రజా చెరో వికెట్ తీశారు.