Champions Trophy 2025 India:2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు తమ దేశానికి రావాలంటూ పాకిస్థాన్ ప్లేయర్లు టీమ్ఇండియాను రిక్వెస్ట్ చేస్తున్న తరుణంలో ఆ దేశ మాజీ ఆటగాడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లకూడదంటూ ఆ దేశ మాజీ ప్లేయర్ దానిశ్ కనేరియా తాజాగా పేర్కొన్నాడు. పాకిస్థాన్‌లో తాజా పరిస్థితుల దృష్యా టీమ్ఇండియా అక్కడకు వెళ్లకపోవడమే మంచిదని కనేరియా తెలిపాడు.
'ప్రస్తుతం పాకిస్థాన్‌లో పరిస్థితులను చూస్తే, టీమ్ఇండియా అక్కడకు వెళ్లకపోవడమే మంచింది. నేను కూడా టీమ్ఇండియాను పాకిస్థాన్ వెళ్లవద్దనే చెబుతాను. దీనిపై పాకిస్థాన్ కూడా ఓసారి ఆలోచించాలి. ఆ తర్వాత ఐసీసీ ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికైనా ఆటగాళ్ల భద్రతయే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాత గౌరవం అనేది రెండో ప్రాధాన్యం. ఈ విషయంలో బీసీసీఐ అద్భుతంగా వ్యవహరిస్తోంది. కానీ, ఐసీసీ తుది నిర్ణయాన్ని అన్ని దేశాలు కూడా గౌరవిస్తాయని నేను అనుకుంటున్నా. నాకు తెలిసి ఈ టోర్నీ కచ్చితంగా హైబ్రిడ్ మోడల్లో దుబాయ్‌లోనే జరిగే ఛాన్స్ ఉంది' అని కనేరియా అన్నాడు.
మరికొందరు ఇలా
ఇదిలా ఉండగా, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్‌కు గుడ్ బై చెప్పేలోపైనా పాకిస్థాన్‌ను సందర్శించాలని ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఇటీవల ఆకాంక్షించాడు. 'విరాట్, రోహిత్ తమతమ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించే ముందు పాకిస్థాన్‌ను సందర్శిస్తే బాగుంటుంది. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు. ప్రతీ క్రికెట్ అభిమాని వాళ్లను ఇష్టపడతాడు. వాళ్ల బ్యాటింగ్, మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్‌లకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోహ్లీ తన ప్రదర్శనతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. రోహిత్ ఇప్పుడు వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్. ఈ స్టార్లు పాకిస్థాన్‌లో ఆడితే ప్రపంచంలో ఎక్కడాలేని ఫ్యాన్ బేస్ అనుభూతిని పొందుతారు' అని అక్మల్ రీసెంట్గా అన్నాడు.