Olympics 2036 :2010 (కామన్వెల్త్ క్రీడలు)లో బహుళ క్రీడల టోర్నీకి చివరిసారిగా ఆతిథ్యమిచ్చిన భారత్ ఇప్పుడు 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఆ విషయాన్ని తెలియజేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఓ లేఖను కూడా సమర్పించింది. అయితే అహ్మదాబాద్‌లో ఈ విశ్వ క్రీడలను నిర్వహించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఈ క్రమంలో ఒకవేళ బిడ్ గెలిస్తే ఒక్క అహ్మదాబాద్‌లోనే కాకుండా దేశంలోని వివిధ నగరాల్లోనూ ఈ పోటీలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో ఉన్న క్రీడా సౌకర్యాలను ఉపయోగించుకోవాలన్నదే వారి ఉద్దేశం. అయితే ఈ ప్లాన్ ఓకే చేసినా కూడా అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగానే పోటీలు జరుగుతాయని తెలుస్తోంది.
ఖర్చును తగ్గించడం కోసం ఏ ఆతిథ్య దేశమైనా సరే ఒలింపిక్ క్రీడలను ఒకటి కంటే ఎక్కువ నగరాల్లో నిర్వహించడానికి వీలు కల్పించే ప్రతిపాదనకు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) 2014లోనే ఆమోదం తెలిపింది. అందుకే ఒలింపిక్ ఆతిథ్య హక్కులు భారత్‌కు దక్కితే ఇక ఇక్కడి వివిధ నగరాల్లో ఉన్న క్రీడా వసతులకు తగినట్లుగా ఆయా ఈవెంట్లను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతాయి. ఎలా ఉంటే హాకీ కేంద్రంగా పేరున్న ఒడిశాలో హాకీ మ్యాచ్‌లను ఆడిస్తారు. అలాగే రోయింగ్ ఈవెంట్లను భోపాల్‌లో, ఆ తర్వాత కనోయింగ్, కయాకింగ్‌లకు పుణె వేదికగా మారనుంది.