Manu Bhaker Grand Mother Died :భారత స్టార్ షూటర్ మను భాకర్ ఇంట విషాదం నెలకొంది. హరియాణాలోని చర్ఖీ దాదరీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె అమ్మమ్మ అలాగే మేనమామ దుర్మరణం పాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వారు వెళ్తున్న బైక్‌ను ఓ కారు ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కారు నడిపిన డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఇదీ జరిగింది :
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చర్ఖీ దాదరీలోని మహేంద్రగఢ్ బైపాస్ రోడ్డులో మను భాకర్ మామయ్య, అమ్మమ్మ స్కూటర్‌పై వెళ్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక వాహనం వాళ్ల స్కూటర్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. తదుపరి విచారణ చేపడుతున్నారు.
ఇంతలోనే ఇలా!
రెండు రోజుల క్రితమే మను భాకర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదగా ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డు అందుకుంది. ఇంతలోనే ఈ ఘటన జరగడం బాధకు గురిచేస్తోందని మను అభిమానులు అంటున్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. బీ స్ట్రాంగ్ మను అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.