T20 World Cup 2024 ambassador Usain Bolt :మరో నెల రోజుల్లో మొదలుకానున్న పొట్టి క్రికెట్ వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 1 నుంచి 29 వరకు ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024కు యూఎస్, వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దాదాపు అన్ని దేశాలు తమ వరల్డ్ కప్ టీమ్‌ల ఎంపికలో బిజీగా ఉన్నాయి. ఈ సమయంలో ఐసీసీ నుంచి టీ20 వరల్డ్ కప్‌కి సంబంధించి బుధవారం కీలక అప్‌డేట్ రిలీజ్ అయింది. టోర్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఒలింపిక్ లెజెండ్ ఉసేన్ బోల్ట్‌ను ఎంపకి చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. బోల్డ్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేయడం వల్ల, టీ20 వరల్డ్‌కప్ మరిన్ని దేశాలకు పరిచయం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు టోర్నీ నిర్వాహకులు. విభిన్న రకాల స్పోర్ట్స్ ఫ్యాన్స్‌ను టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఆకర్షిస్తుందని నమ్ముతున్నారు.
కాగా, 2008 బీజింగ్‌లో జరిగిన ఒలంపిక్ గేమ్స్‌లో బోల్డ్ పేరు ప్రపంచానికి పరిచయం అయింది. ఈ ఒలింపిక్స్‌లో బోల్డ్ 100 మీ, 200 మీ, 4x100 మీ రేసులను అతి తక్కువ సమయంలో పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇప్పటికీ అతి తక్కువ సమయంలో రేసులు పూర్తి చేసిన రికార్డులు బోల్డ్ పేరు మీదే ఉన్నాయి. 100 మీ, 200 మీ, 4x100 మీటర్ల రేసులను వరుసగా 9.58 సెకన్లు, 19.19 సెకన్లు, 36.84 సెకన్లలో పూర్తి చేశాడు. వరుసగా మూడు ఒలింపిక్స్‌లో మూడు బంగారు పతకాలు గెలిచి రికార్డు సృష్టించాడు.
- ప్రచార గీతంతో మొదలు -టీ20 ప్రపంచ కప్ అంబాసిడర్‌గా, ప్రచారాల్లో బోల్ట్ కీలక పాత్ర పోషించనున్నాడు. వచ్చే వారం వరల్డ్‌కప్ అధికారిక ప్రచార గీతం మ్యూజిక్ వీడియోను ఐకానిక్ ఆర్టిస్టులు సీన్ పాల్, కేస్‌తో కలిసి విడుదల చేయనున్నాడు. వెస్టిండీస్‌లో జరిగే T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లకు కూడా హాజరవుతాడు. యునైటెడ్ స్టేట్స్‌లో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు నిర్వహించే కార్యక్రమాల్లో భాగమవుతాడు.
బోల్ట్ తన కొత్త రోల్‌పై మాట్లాడుతూ - "రాబోయే ICC మెన్స్ T20 ప్రపంచ కప్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడంపై ఎక్సైటింగ్‌గా ఉన్నాను. క్రికెట్ జీవితంలో భాగమైన కరేబియన్ నుంచి వస్తున్నాను. ఈ క్రీడకు నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. వెస్టిండీస్ మ్యాచ్‌లకు హాజరయ్యేందుకు నేను ఎదురుచూస్తున్నాను. ప్రపంచ కప్, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ వృద్ధికి నా వంత సహకారం అందిస్తాను. నేను ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌కు మద్దతు ఇస్తాను. అయితే క్రికెట్‌ను యూఎస్‌లో ప్రోత్సహించడం కీలకం. యూఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ మార్కెట్. T20 ప్రపంచ కప్‌కు మేము తీసుకొచ్చే ప్రచారం, 2028లో LA ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి దారితీసే గొప్ప అవకాశం" అని తెలిపాడు.