IPL 2025 Uppal Stadium Matches : 2025 ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి మే 25 వరకు ఈ సీజన్ జరగనుంది. 65 రోజులపాటు క్రికెట్ ప్రియులను అలరించేందుకు ఈ క్యాష్ రిచ్ లీగ్ రెడీ అవుతోంది. మొత్తం 74 మ్యాచ్‌లు 13 వేదికల్లో జరగనున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం 9 మ్యాచ్‌లకు వేదిక కానుంది.
ఉప్పల్‌లో స్టేడియంలో మ్యాచ్ అంటే స్టేడియానికి ప్రేక్షకులు పోటెత్తుతారు. మరీ ముఖ్యంగా ఉప్పల్‌లో ముంబయి, బెంగళూరు, చెన్నై జట్లు మ్యాచ్ ఆడుతున్నాయంటే మాత్రం స్టేడియం కిక్కిరిసిపోతుంది. మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే, సన్‌రైజర్స్ ఈ మూడు జట్లతో ఆడే మ్యాచ్‌లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. టీమ్ఇండియా స్టార్లు రోహిత్ శర్మ (ముంబయి), విరాట్ కోహ్లీ (ఆర్సీబీ), ధోనీ (చెన్నై) ఈ జట్లకు ప్రాతినిధ్యం వహించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ స్టార్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి వస్తారు.
ఈసారి కూడా అలాగే స్టేడియానికి వెళ్లి తమ అభిమాన క్రికెటర్లను లైవ్‌లో చూసేందుకు క్రికెట్ లవర్స్ ప్లాన్ వేసేస్తున్నారు. కానీ, షెడ్యూల్ చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ఆర్సీబీ, చెన్నై ఫ్యాన్స్‌కు మాత్రం షాక్ తగిలినట్లైంది. ఎందుకంటే, ఈ సీజన్లో బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో లేవు. దీంతో తమ ఫేవరెట్ స్టార్లు విరాట్ కోహ్లీ (ఆర్సీబీ), ధోనీ (సీఎస్కే)ను లైవ్‌లో చూసే ఛాన్స్ మిస్ అయ్యారు.