Nikhat Zareen Olympics 2024:పారిస్ ఒలింపిక్స్‌లో కేవలం పతకం కాదు, స్వర్ణమే గెలుస్తుందని తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పై భారత అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే పతక రౌండు కన్నా ముందే టోర్నీ నుంచి ఆమె వైదొలిగింది. గురువారం జరిగిన 50 కేజీల విభాగం ప్రీ క్వార్టర్స్‌లో నిఖత్ 0-5తో చైనా బాక్సర్ వుహు చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ ఇలా తేలిపోవడాన్ని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో నిఖత్ కూడా పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇంటిముఖం పట్టడంపై భావోద్వేగానికి గురైంది.
తిండి, నీళ్లకు నో
తాను పోటీ పడుతున్న 50 కేజీల విభాగానికి తగ్గట్లు బరువు ఉండేందుకు పోటీల ముంగిట నిఖత్ సరిగా తిండి, నీళ్లు తీసుకోలేదు. ఖాళీ కడుపుతోనే శిక్షణ పొందింది. పారిస్ ఒలింపిక్స్ ఓటమి తనను ఎక్కువ కాలం వెంటాతుందని నిఖత్ జరీన్ ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ తెలిపింది. ఓటమి బాధ నుంచి బయటపడేందుకు ఒంటరిగా ట్రిప్‌కు వెళ్తానని చెప్పింది. అలాగే కుటుంబంతో కొంత సమయం గడుపుతానని వెల్లడించింది.
బలంగా తిరిగి వస్తా
'సారీ గాయ్స్. నేను దేశం కోసం పతకం గెలవలేకపోయాను. ఇక్కడకు చేరుకోవడానికి నేను చాలా త్యాగాలు చేశాను. ఈ ఒలింపిక్స్ కోసం నేను మానసికంగా, శారీరకంగా నన్ను బాగా సిద్ధం చేసుకున్నాను. బరువును మెయింటెన్ చేయడం కోసం నేను గత రెండు రోజులుగా తిండి తినలేదు. అలాగే నీరు కూడా తాగలేదు. బరువు తగ్గాక కొంచెం నీరు తాగాను. కానీ నాకు కోలువడానికి సమయం లేకపోయింది. గత రెండు రోజుల్లో గంటలకొద్దీ పరుగెత్తాను. పతక వేటలో నేను బలంగా తిరిగి వస్తాను. నేను ప్రీక్వార్టర్ మ్యాచ్ లో గెలిచినట్లైతే నా కష్టాన్ని అందరూ ప్రశంసించేవారు. కానీ ఓడిపోవడం వల్ల అది ఒక సాకుగా కనిపిస్తుంది. నేను బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాను' అని నిఖత్ పేర్కొంది