Babar Azam Arshad Nadeem:పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి సంచలనం సృష్టించాడు. ఫైనల్‌లో ఏకంగా 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడి ముద్దాడి ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ 40ఏళ్ల స్వర్ణ పతకం నిరీక్షణకు తెరదించాడు. ఒలింపిక్స్‌లో పాక్ చివరిసారి 1984లో పసిడి పతకం సాధించింది. ఈ విజయంతో పాక్‌లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సైతం అర్షద్ నదీమ్‌పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. అయితే ఓవైపు నెటిజన్లు అర్షద్‌ను మెచ్చుకుంటూనే మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్‌ను ట్రోల్ చేస్తున్నారు. అర్షద్ విసిరిన ఈట దూరంతో బాబర్ ఆజమ్ స్ట్రైక్ రేట్‌ను పోలుస్తూ హేళన చేస్తున్నారు. ఆర్షద్ 92.97మీటర్ల కంటే బాబర్ వన్డే ఫార్మాట్ స్ట్రైక్ రేట్ (88.75) తక్కువ అంటూ మీమ్స్ చేస్తున్నారు. మరికొందరు అర్షద్ ఈట డిస్టెన్స్ 92.97మీ, బాబర్ 2022 టీ20 వరల్డ్‌కప్ స్ట్రైక్ రేట్ (93.20) దాదాపు సమానమే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు.
కాగా, పారిస్ ఒలింపిక్స్ ఇదే ఈవెంట్లో భారత స్టార్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ దక్కించుకున్నాడు. అతడు రెండో ప్రయత్నంలో ఈటెను 89.45 మీటర్లు విసిరాడు. దీంతో మొత్తం 12 మంది పోటీ పడ్ ఈ ఫైనల్‌లో రెండో స్థానంలో నిలిచాడు. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్‌కు కాంస్యం వచ్చింది.