Neeraj Chopra Paris Olympics:టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లోనూ దూసుకెళ్తున్నాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో తొలి ప్రయత్నంలోనే ఈటను 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు చేరాడు. ఈ క్రమంలో మీడియాతో నీరజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ కోసం తన అత్యుత్తమ ప్రదర్శనను కాపాడుకున్నానని నీరజ్ చోప్రా తెలిపాడు.
'ఇది కేవలం క్వాలిఫికేషన్ రౌండ్. ఫైనల్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. మంచి ప్రారంభం లభించింది. 84 మీటర్ల ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్కుతో అర్హత సాధించిన త్రోయర్లందరూ ఫైనల్‌లో నాకు పోటీగా ఉంటారు. నా బెస్ట్ ఇంకా నేనివ్వలేదు. ఫైనల్ కోసం నా అత్యుత్తమ ప్రదర్శనను సేవ్ చేస్తున్నా. నేను ఫైనల్‌కు సిద్ధంగా ఉన్నాను. నేను పారిస్‌లో ప్రాక్టీస్‌లో బాగా రాణించలేకపోయాను'
'కానీ క్వాలిఫికేషన్ రౌండ్ ప్రారంభమైనప్పుడు మొదటి త్రోలో అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నా ఫిట్‌నెస్ ఇప్పుడు మెరుగ్గా ఉంది. నేను ఎప్పుడూ మొదటి త్రో నుంచి బాగా విసరడానికి ప్రయత్నిస్తాను. కానీ ప్రతిసారీ అలా జరగదు. మొదటి త్రోలో నేను విఫలమైతే, మిగిలిన త్రోలో నా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ ఏడాది ప్రారంభంలో తగిలిన గాయం బాధను అనుభవిస్తున్నా. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను' అని నీరజ్ క్వాలిఫికేషన్ రౌండ్ తర్వాత విలేకరులతో వ్యాఖ్యానించాడు.