Mumbai Indians Allah Ghazanfar IPL 2024 :2025 ఐపీఎల్ మెగా వేలంలో మరో యువ ఆటగాడిపై కాసుల వర్షం కురిసింది. ఆఫ్గానిస్థాన్‌కు చెందిన 18ఏళ్ల స్పిన్నర్ అల్లాగ్ గజన్‌ఫర్‌ను ముంబయి ఇండియన్స్ (MI) భారీ ధరకు కొనుగోలు చేసింది. అంతర్జాతీయ క్రికెట్లో పట్టుమని పది మ్యాచ్‌లైనా ఆడని కుర్ర స్పిన్నర్ కోసం ముంబయి రూ. 4.80 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఈ ప్లేయర్ ఎవరా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. మరి ఈ ప్లేయర్ ఎవరంటే?
రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన గజన్‌ఫర్ కోసం కేకేఆర్ బిడ్డింగ్ ప్రారంభించింది. ఈ యంగ్ మిస్టరీ స్పిన్నర్ కోసం తొలుత కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా ప్రయత్నించాయి. ముంబయి ఇండియన్స్ బిడ్డింగ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఆర్సీబీ వెనక్కి తగ్గింది. మరోవైపు కేకేఆర్ తమ వంతు ప్రయత్నం చేసినప్పటిరీ, రూ.4.8 కోట్ల భారీ మొత్తానికి ముంబయి గజన్‌ఫర్‌ను సొంతం చేసుకుంది.
పట్టుమని పది మ్యాచ్‌లైనా ఆడలేదు
ఆఫ్గానిస్థాన్ పాక్టియా ప్రావిన్స్‌లో 2006లో గజన్‌ఫర్ జన్మించాడు. 18ఏళ్లకే జాతీయ జట్టు తరఫున వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 8 వన్డేల్లో 12 వికెట్లు దక్కించుకున్నాడు. రీసెంట్గా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో గజన్‌ఫర్ అందరి దృష్టి ఆకర్షించాడు. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ లైనప్‌ను గజన్‌ఫర్ గడగడలాడించాడు. 6.3 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. అతడి దెబ్బకు బంగ్లా 143 పరుగులకే కుప్పకూలింది. కాగా, ఈ చిచ్చరపిడుగు ఇంకా అంతర్జాతీయ టీ20ల్లో అడుగుపెట్టలేదు. అతడి కెరీర్‌లో ఇప్పటివరకు 16టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో 29 వికెట్లు పడగొట్టాడు.