Mumbai Indians Bowling Coach :ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఐపీఎల్ కోసం జట్టులో కీలక మార్పు చేసింది. తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రేను నియమించింది. పరాస్ మాంబ్రే ప్రస్తుత బౌలింగ్ కోచ్ లసిత్ మలింగతో వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం పనిచేస్తారని వెల్లడించింది.
'ముంబయి ఇండియన్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే నియమితులయ్యారు. ఆయన తిరిగి మళ్లీ ముంబయికు వస్తున్నారు. ముంబయి ప్రస్తుత బౌలింగ్ కోచ్ మలింగతో కలిసి పనిచేస్తారు. అలాగే ముంబయి హెచ్ కోచ్ మహేల జయవర్ధనేతో కలిసి కోచింగ్ టీమ్‌లోనూ భాగంగా ఉంటారు' అని ముంబయి ఇండియన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.
గతంలో ముంబయితోనే
కాగా, పరాస్ మాంబ్రే గతంలోనూ ముంబయి ఇండియన్స్ కోచింగ్ టీమ్‌లో భాగంగా ఉన్నాడు. పరాస్ కోచ్‌గా ఉన్న సమయంలో ముంబయి 2013లో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. అలాగే టీ20 ఛాంపియన్స్ లీగ్ 2011, 2013లో విజయం సాధించింది. 2010లో రన్నరప్‌గా నిలిచింది.
టీమ్ఇండియా మాజీ ప్లేయర్
పరాస్ మాంబ్రే టీమ్ఇండియా తరఫున 1996-1998 మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడాడు. మొత్తంలో 5వికెట్లు పడగొట్టాడు. అలాగే ముంబయి తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. 91 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 284 వికెట్లు తీశాడు. 83 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 111 వికెట్లు పడగొట్టాడు.