MS Dhoni CSK :ఈ ఏడాదిఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చాప్టర్ ముగిసింది. ఇప్పటి వరకు అభిమానులను అలరించిన ఈ స్టార్ టీమ్, శనివారం ఆర్సీబీతో జరిగిన పోరులో ఓడి ప్లేఆఫ్స్‌కు ఛాన్స్‌ను వదులుకుంది. అయినప్పటికీ ఎంఎస్ ధోనీ ఆటతీరు అభిమానులను అలరించింది. అంతే కాకుండా సీజన్ మొత్తంలో ధోనీ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. మ్యాచ్ జరిగిన ప్రతి స్టేడియంలోనూ అతడి కోసమే తండోపతండాలుగా అభిమానులు వచ్చేవారంటే అందులో ఏమాత్రం అతిశయోక్తికాదు.
కానీ ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతాడన్న వార్తలు తెగ హల్చల్ చేశాయి. బెంగళూరుతో మ్యాచ్ తర్వాత ధోనీ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, ధోనీ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. అయితే కెప్టెన్ కూల్ భవితవ్యంపై చెన్నై బౌలింగ్ కోచ్ ఎరిక్ సైమన్స్ తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2010 నుంచి ఆయనకు ధోనీతో పరిచయం ఉందని, గేమ్‌ను అర్థం చేసుకోవడంలో ధోనీని మించిన వారెవరూ లేరంటూ కితాబులిచ్చారు.
"ధోనీతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్నప్పుడు జట్టును ఆదుకునే పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు అతడు. ధోనీ క్రీజ్‌లో ఉన్నాడంటే ఇక మ్యాచ్ విజయం సాధించే స్థితిలో మేమున్నట్లేనంటూ డగౌట్‌లో కూర్చొని అనుకొనేవాళ్లం. జట్టులో ఆ కాన్ఫిడెన్స్‌ను నింపడంలో ధోనీకి మించినవారు లేరు. గేమ్‌ను ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవడంలోనూ అతడు ముందుంటాడు. గొప్ప క్రికెటర్లు అందరూ అలా చేయగలిగినప్పటికీ, దాన్ని ఆచరణలో పెట్టాలంటే మాత్రం అది ధోనీకే సాధ్యం. యంగ్ ప్లేయర్స్‌ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటాడు. అయితే ప్రతి మ్యాచ్‌లోనూ ధోనీ భవితవ్యంపై చర్చ కొనసాగుతోంది. ఇది వినడానికి చాలా క్రేజీ ఉంటుంది. ధోనీకి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఈ సీజన్‌కు ముందు జరిగిన ప్రీ సెషన్ ప్రాక్టీస్ సమయంలోనూ అతడి బ్యాటింగ్‌ను నేను ప్రత్యక్షంగా చూశాను. బంతిని అనలైజ్ చేసి అతడు ఎంతో చక్కగా ఆడుతాడు. ఇదే ఆటతీరును టోర్నీలోని మ్యాచుల్లోనూ చూశాం. అందుకే అతడు తన భవిష్యత్తుపై పూర్తి అవగాహనతోనే ఉంటాడు. తప్పకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు" అని ఎరిక్ వెల్లడించాడు.