Most Ducks against India: టెస్టు ఫార్మాట్ క్రికెట్ అంటే ఆ కిక్కే వేరు. ఈ సంప్రదాయ ఫార్మాట్లో జాతీయ జట్టు తరఫున ఆడాలని ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. టెస్టు క్రికెట్‌కు 100ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ ఫార్మాట్లో భారత్ ఇప్పటివరకు 577 మ్యాచ్‌లు ఆడగా అందులో 176 నెగ్గి, 178 ఓడింది. ఇక 222 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఒకటి టైగా ముగిసింది. భారత్ ఇందులో అత్యధికంగా ఇంగ్లాండ్‌తో 134 మ్యాచ్‌ల్లో, అఫ్గానిస్థాన్‌తో 1 టెస్టు ఆడింది. ఈ క్రమంలో భారత్‌తో మ్యాచ్‌లో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్లెవరో తెలుసా?
1. కగిసో రబాడా (సౌతాఫ్రికా): తన పదునైన బంతులతో ప్రత్యర్థులను భయపెట్టే రబాడా టెస్టులలో అప్పుడప్పుడూ సిక్స్‌లు కూడా బాదగలడు. అయితే టెస్టుల్లో భారత్‌తో మ్యాచ్‌లో మాత్రం రబాడానే ఎక్కువసార్లు సున్నా చుట్టేశాడు. ఇప్పటి దాకా 24 ఇన్నింగ్స్‌ల్లో 5సార్లు రబాడా డకౌట్ అయ్యాడు.
2. గస్ లోగి (వెస్టిండీస్): గస్ లోగి ఈ క్రికెటర్ పేరు పెద్దగా వినకపోవచ్చు. ఇతడు వెస్టిండీస్‌కు చెందిన ఆటగాడు. కరేబియన్ జట్టు తరఫున 52 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 35.79 సగటుతో 2470 పరుగులు సాధించాడు. ఇండియాతో ఆడిన మ్యాచ్‌ల్లో 23 ఇన్నింగ్స్ లో 5 సార్లు సున్నాకే వెనుదిరిగాడు.
3. బ్రెట్ లీ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా స్టార్ పేసర్, స్పీడ్ గన్ బ్రెట్ లీ ఇండియాపై ఎన్నో వికెట్లు తీశాడు. వేగమైన బంతులేస్తూ బ్యాటర్లను భయపెట్టాడు. కానీ బ్యాటింగ్ విషయానికి వస్తే, భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 16 ఇన్నింగ్స్ లు ఆడి 5 సార్లు డకౌటయ్యాడు.
4. జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ హేజిల్‌వుడ్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడతాడు. హేజిల్‌వుడ్ కూడా భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 23 ఇన్నింగ్స్‌ల్లో 5 సార్లు జీరోకే పెవిలియన్ చేరాడు.
5. స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్): స్టువర్ట్ బ్రాడ్ పేరు చెప్పగానే మనకు యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సులు గుర్తొస్తాయి. కానీ బ్రాడ్ వరల్డ్ క్లాస్ బౌలరే. ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అతడూ ఒకడు. టీమ్ఇండియాతో ఆడిన 32 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో బ్రాడ్ కూడా 5 సార్లు సున్నాకే వెనుదిరిగాడు.
6. షేన్ వార్న్ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో ఉన్నాడు. అద్భుతమైన లెగ్ స్పిన్ బౌలింగ్ తో వికెట్లను గిరాటేసే లక్షణం అతని సొంతం. అయితే ఇండియాతో ఆడిన 22 ఇన్నింగ్స్‌ల్లో 6 సార్లు డకౌట్ అయ్యాడు.