Mona Aggarwal Paralympics 2024 : ఆడపిల్లల్ని భారంగా భావించే కుటుంబంలో పారా షూటర్ మోనా అగర్వాల్ పుట్టింది. ఆమెకు ఇద్దరు అక్కలు. ఇక మూడో బిడ్డైనా కొడుకు పుడితే బాగున్ను అనుకున్నారు మోనా అగర్వాల్ తల్లిదండ్రులు. కానీ మోనా పుట్టడంతో నిరాశ చెందారు. ఆడపిల్ల అంటూ అయిష్టంగానే మోనాను పెంచారు. దీనికి తోడు తొమ్మిది నెలల ప్రాయంలో మోనా పోలియో బారిన పడింది. దాంతో ఆమె రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి.
అమ్మమ్మే స్పూర్తి
ఇలా మోనా జీవితం నరకప్రాయంగా మారింది. 'ఆడపిల్లే భారమనుకుంటే, అంగవైకల్యం కూడా తోడైంది.' అంటూ ఇరుగుపొరుగు వారు, బంధువులు ఆమెను ఆడిపోసుకునేవారు. అయినా ఈ సవాళ్లకు ఆమె ఎదురు నిలవగలిగిందంటే, అదంతా మోనా అమ్మమ్మ గీతా దేవి చలవే అని చెప్పాలి. ఎందుకంటే ఎవరెన్ని మాటలన్నా, దెప్పి పొడిచినా మోనా అమ్మమ్మే ఆమెలో ధైర్యం నింపేది. ఆమె స్ఫూర్తితోనే జీవితంలో ఎవరిపైనా ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడాలనుకుంది మోనా. ఈ క్రమంలోనే తనకు ఆసక్తి ఉన్న ఆటలపై ఫోకస్ చేసింది. తొలుత షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో తదితర క్రీడల్లో రాణించినా షూటింగ్ ప్రయత్నించాక దాన్నే ఇష్టపడింది మోనా.
భర్త కూడా అండగా
కాగా, వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు రవీంద్ర ఛౌధరిని వివాహం చేసుకుంది మోనా. అప్పుటి నుంచి మోనాకు భర్త ప్రోత్సాహం కూడా తోడైంది. దీంతో పూర్తి స్థాయిలో షూటింగ్ పై పట్టు పెంచుకుంది. 2021 నుంచి క్రీడల్లో పాల్గొనడం ప్రారంభించింది. ఇక ఈసారి పారిస్ ఒలింపిక్స్ లో పోటీ పడిన ఆమె, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్యం సాధించింది. ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న మోనా, అటు తన ఇద్దరు పిల్లల బాధ్యతను నిర్వర్తిస్తూనే ఇటు షూటింగ్‌లోనూ అదరగొడుతోంది.