Shami Ex Wife Hasin Allegations :టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీపై అతడి మాజీ భార్య హసీన్ జహన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఇటీవల షమీ తన కుమార్తెను కలిసి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. చాలా రోజుల తర్వాత తన కుమార్తెను కలిసిన షమీ ఎమోషనల్ అయ్యాడు. దీనిపై తాజాగా అతడి మాజీ భార్య స్పందించింది. షమీ తన కూతురిని కేవలం కేవలం షో ఆఫ్ కోసమే కలిశాడని ఆరోపించింది. షమీ ప్రేమంతా ఫేక్ అని విమర్శించింది.
కూతురును పట్టించుకోడు
తమ కూతురు ఐరాను షమీ పట్టించుకోడని హాసిన్ జహాన్ ఆరోపించింది. గిటార్, కెమెరా కావాలని ఐరా అడిగినా కొనుగోలు చేయలేదని తెలిపింది. ' ఐరాను షమీ కలిసింది కేవలం షో ఆఫ్ కోసమే. నా కూతురు పాస్ పోర్ట్ గడువు ముగిసింది. కొత్త పాస్ పోర్ట్ కోసం షమీ సంతకం కావాలి. అందుకే ఐరా తండ్రిని కలిసింది. అయినా పాస్ పోర్ట్ పై షమీ సంతకం చేయలేదు. ఐరాతో కలిసి షమీ షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. అక్కడ తాను ఎండార్స్ చేసే బ్రాండెడ్ షూస్, బట్టలు కొన్నాడు. ఆ కంపెనీకి చెందిన వస్తువులు ఏవీ కొన్నా వాటికి షమీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకే ఆ మాల్‌కు తీసుకెళ్లాడు. ఆమెకు కావాల్సిన గిటార్, కెమెరా కొనలేదు. షమీ నా కుమార్తె గురించి ఎప్పుడూ ఆలోచించడు. ఐరాను ఒక నెల క్రితం కూడా షమీ కలిశాడు. కానీ, అప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు చేయలేదు. ఇప్పుడు పోస్టు చేయడానికి గల కారణాలేంటో?' అని హాసిన్ జహాన్ విమర్శించింది.
కాగా, ఇటీవల షమీ తన కూతురు ఐరాను కలిశాడు. ఈ క్రమంలో ఆమెతో షాపింగ్ చేశాడు. సరదాగా ఆమెతో సమయం గడిపాడు. ఆ సమయంలో షమీ కాస్త ఎమోషనల్ అయ్యాడు. అనంతరం తన కూతురితో గడిపిన ఆనంద క్షణాలను వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'చాలా కాలం తర్వాత మళ్లీ నిన్ను చూశాను. ఆ క్షణంలో కాలం ఒక్కసారిగా ఆగిపోయినట్లు అయింది. నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో మాటలతో చెప్పలేను, బెబో' అని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇదే విషయంపై షమీ భార్య హాసిన్ జహాన్ అతడిపై తాజాగా విమర్శలు గుప్పించింది.