Mohammad Shami Reentry : ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమ్ ఇండియాతో పాటు భారత క్రికెట్ జట్టు అభిమానులకు ఓ శుభవార్త అందింది. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. చీలమండ గాయంతో దాదాపు ఏడాది పాటు జట్టుకు దూరమైన షమీ, ఇప్పుడు బంగాల్ తరఫున రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. మధ్యప్రదేశ్‌తో బుధవారం(నవంబర్ 13) జరిగే ఐదో రౌండ్ రంజీ మ్యాచ్‌లో బంగాల్ తరఫున బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అఫీషియల్‌గా తెలిపింది.
నిజానికి కర్ణాటకతో జరిగిన నాలుగో రౌండ్ రంజీ మ్యాచ్‌లోనే షమీ బరిలోకి దిగాలి. కానీ పూర్తి ఫిట్‌నెస్ సాధించని కారణంగా అది కుదరలేదు. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించాడు షమీ. దీంతో ఇప్పుడు బంగాల్ తరఫున ఆడేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. ఇప్పుడీ రంజీ ట్రోఫీలో షమి మునపటిలా అదరగొడితే అతడు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిరీస్ మధ్యలోనైనా అతడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అందుబాటులోకి రావొచ్చు.
కాగా, గత ఏడాది నవంబర్‌లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చివరి సారిగా భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు షమీ. అప్పుడే చీలమండ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అనంతరం విదేశాల్లో సర్జరీ చేయించుకున్నాడు. దీంతో ఏడాది పాటు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. పూర్తి విశ్రాంతి తీసుకున్నాడు. రీసెంట్‌గానే గాయం నుంచి పూర్తిగా కోలుకుని శిక్షణ ప్రారంభించాడు. దీంతో న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్ లేదా దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు.