Mithali Raj On Team India:మహిళల టీ20 ఆసియా కప్ టోర్నీలో భారత్‌కు నిరాశ తప్పలేదు. అజేయంగా ఫైనల్ చేరిన హర్మన్‌సేనను శ్రీలంక ఫైనల్లో ఓడించి షాక్ ఇచ్చింది. ఈ ఓటమి పక్కన పెడితే 2024 అక్టోబర్‌లో ప్రతిష్టాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. మెగా టోర్నీలో సత్తా చాటాలంటే భారత్ అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉండాలి. దీనిపై భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తాజాగా స్పందించింది. భారత్ నెం.3 బ్యాటింగ్ పొజిషన్‌లో చాలా మందిని ఆడిస్తోందని ఆ స్థానాన్ని మెరుగుపరచుకోవడంపైనే కీలక దృష్టి పెట్టాలని ఆమె అభిప్రాయపడింది. రాబోయే మహిళల T20 ప్రపంచ కప్‌కు టీమ్ఇండియా ఎలా సిద్ధపడాలో తెలిపింది. జట్టులో అవసరమైన కొన్ని మార్పులపై సూచనలు చేసింది.
'టీమ్ఇండియా అక్టోబరులో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆడనుంది. భారత్ నంబర్ 3 బ్యాటింగ్ పొజిషన్ మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలని నేను భావిస్తున్నాను. టీమ్ ఇంకా ఆ పొజిషన్‌లో సరైన బ్యాటర్ కోసం వెతుకుతోంది. ఇప్పటికే హేమలతను, చెత్రీని ప్రయత్నించారు. కానీ, వన్‌డౌన్‌లో షఫాలీ, స్మృతి అందించే ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్లగల బ్యాటర్ అవసరం. అలాగే బౌలింగ్ విషయంలోనూ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం 5 మంది బౌలర్లతో ఆడుతున్నారు. వారికి బహుశా 6వ బౌలర్ అవసరం కావచ్చు. ఆల్ రౌండర్‌ని ఎంచుకుంటే అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ చేయగలరని నేను భావిస్తున్నాను. ప్రపంచ కప్‌లోకి అడుగుపెట్టే ముందు ఈ సమస్యలను భారత్ అధిగమించాలి' అని మిథాలీ వివరించింది.