Nitish Kumar Reddy International Cricket : బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో తెలుగు తేజం, టీమ్ఇండియా బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొడుతున్నాడు. తొలి మూడు టెస్టుల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న ఈ యంగ్ బ్యాటర్, బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో(114) కదం తొక్కాడు. ఈ క్రమంలో నితీశ్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి.
అయితే నితీశ్ కుమార్ రెడ్డి టెస్టుల్లోనే కాకుండా టీ20ల్లోనూ స్థిరమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఫార్మాట్లకు తగ్గట్టుగా ఆడి భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన నితీశ్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకుంటున్నాడు.
మెల్ బోర్న్లో డెబ్యూ సెంచరీ
బాక్సింగ్ డే టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఐకానిక్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తన తొలి టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. అలాగే నంబరు 8లో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదిన మొదటి భారత ఆటగాడిగా నిలిచాడు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగల సామర్థ్యం!
బాక్సింగ్ డే టెస్టులో అవసరమైనప్పుడు డిఫెన్స్ ఆడుతూ, మిగతా సమయాల్లో దూకుడు ప్రదర్శించాడు నితీశ్. ఒత్తిడి, సవాళ్లతో కూడిన పరిస్థితిలోనూ తాను ఆడగలనని మరోసారి నిరూపించుకున్నాడు. అందుకే క్రికెట్ విశ్లేషకులు, రవిశాస్త్రి సహా మరికొందరు మాజీ ఆటగాళ్లు సైతం నితీశ్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు.
జట్టుకు సహకారం
బాక్సింగ్ డే టెస్టులో టీమ్ ఇండియా ఫాలో ఆన్ బారిన పడకుండా కాపాడడంలో నితీశ్ కీలక పాత్ర పోషించాడు. వాషింగ్టన్ సుందర్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నిర్మించి జట్టు స్కోరును 369 పరుగులకు చేర్చాడు.
ఫార్మాట్
నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ శైలి టీ20 ఫార్మాట్ తగ్గట్లు ఉంటుంది. అయినప్పటికీ టెస్టు క్రికెట్ ఫార్మాట్‌కు మారాడు. అందుకు తగ్గట్లు టెక్నిక్స్‌ను మార్చుకుని రాణిస్తున్నాడు. ఈ క్రమంలో లోయర్ ఆర్డర్లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు.
టీ20ల్లో ప్రదర్శన
ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్ లోనూ నితీశ్ రాణించాడు. తన రెండో మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించాడు. 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ చాలు నితీశ్ ఎంత పవర్ హిట్టర్ తెలపడానికి. అలాగే అదే మ్యాచ్ లో నితీశ్ రెండు వికెట్లను తీశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
ఐపీఎల్
నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పటికే దేశీయ క్రికెట్, ఐపీఎల్లో తానేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. 33.67 సగటుతో 303 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 142.92. దీంతో ఐపీఎల్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది.
ఫార్మాట్ ఏదైనా అదుర్స్!
టీ20, టెస్టు ఫార్మాట్లో నితీశ్ నిలకడగా రాణిస్తున్నాడు. కీలకమైన మ్యాచుల్లో బ్యాట్, బాల్ లో అదరగొడుతున్నాడు. అందుకే జట్టు విజయాల్లో గేమ్ ఛేంజర్‌గా మారుతున్నాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే వచ్చే ఏడాది నితీశ్ కుమార్ రెడ్డి ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.