Mitchell Starc KKR :కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2024వ సీజన్ లోనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ ఇది. ఈ హోరాహోరీ సమరం, స్టేడియంలోని అభిమానులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ కలిగించింది. చివరి బంతి వరకూ సాగిన సస్పెన్‌ను రాజస్థాన్ మ్యాచ్ గెలిచి ముగించింది. గేమ్ ముగిసే కొద్దీ సిక్సులతో, బౌండరీలతో స్టేడియంలో ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. ఐపీఎల్ మ్యాచ్ అంటే ఇలా ఉండాలని అనుకునేంత జోష్ నింపేసింది మంగళవారం జరిగిన గేమ్.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 223 పరుగులు చేశారు. సునీల్ నరైన్ దంచికొడుతూ, ప్రత్యర్థి బౌలర్లను శాసించాడు. 56 బంతుల్లో 109 పరుగులు చేసి ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాడు. యువ క్రికెటర్ రగువంశీ 18 బంతుల్లో 30 పరుగులు చేశాడు. రింకూ సింగ్ సైతం 9 బంతుల్లో 20 పరుగులు చేసి కేకేఆర్ జోరును పెంచడంలో కీలకమయ్యారు. సెకండాఫ్‌లో రాజస్థాన్ రాయల్స్ రెచ్చిపోయి చివరి బంతి ముగిసే సమయానికి విజయాన్ని అందుకుంది.
ఈ ఉత్కంఠభరితమైన పోరులో జోస్ బట్లర్ ఇన్నింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌కు గుర్తుండిపోయే విజయాన్ని అందించింది. చివరి బంతి వరకూ ఆడి 60 బంతుల్లో 107 పరుగులు చేశాడు బట్లర్. భారీ లక్ష్య చేధనతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఆరంభం నుంచి దన్నుగా నిలిచాడు. 224 పరుగుల లక్ష్యాన్ని చేరుకోగలిగాడు.