Mitchell Marsh Delhi Capitals :ఇటీవలే లఖ్‌నవూపై పైచేయి సాధించిన దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు తాజాగా ఓ షాక్ ఎదురైంది. ఆ జట్టుకు చెందిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. చీలమండలో పగులు రావడం వల్ల ఆపరేషన్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా అతన్ని స్వదేశానికి రావాలని సూచించింది. దీంతో విశ్రాంతి తీసుకునేందుకు అతడు ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. అయితే, చికిత్స తర్వాత తదుపరి పరిస్థితిని బట్టి మిచెల్ దిల్లీ జట్టులో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరిగా మార్ష్ ఆడాడు. ఆ తర్వాత ముంబయి, లఖ్‌నవూ మ్యాచ్‌లకు కూడా అతడు దూరమయ్యాడు. ఈ టోర్నీలో విఫలమైన మిచెల్, రాజస్థాన్‌పై అత్యధికంగా 23 పరుగులను స్కోర్ చేశాడు. మరోవైపు ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇక ఆస్ట్రేలియా టీ20 జట్టుకు మార్ష్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. ఇది దృష్టిలో ఉంచుకుని అతడు మరింత విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం.
ఇక ఇప్పటి వరకు దిల్లీ క్యాపిటల్స్ జట్టు మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.