Mike Tyson VS Jake Paul : చాలా సంవత్సరాల తర్వాత బాక్సింగ్ ప్రియులకు బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ (58) పంచ్‌లు చూసే అవకాశం దక్కింది. ఈ లెజెండ్ మరోసారి రింగ్‌లోకి దిగబోతున్నాడు. ఇన్నేళ్ల తర్వాత టైసన్ బరిలో దిగుతుండటం ఒక ఎత్తైతే, సంచలన విజయాలతో దూసుకుపోతున్న 27 ఏళ్ల జేక్ పాల్‌తో తలపడనుండటం మరో విశేషం.
ఈ బాక్సింగ్ మ్యాచ్‌కు ప్రపంచమంతా ఆసక్తి ఎదురు చూస్తున్న తరుణంలో ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఫైనల్ వెయిట్-ఇన్ సమయంలో జేక్ పాల్‌ను టైసన్ చెంప దెబ్బ కొట్టాడు. దీంతో మ్యాచ్ ఎలా ఉండబోతోందోననే ఆసక్తి వంద రెట్లు పెరిగింది. టైసన్ ఎందుకు కొట్టాడు? మ్యాచ్ ఎక్కడ చూడాలి? వంటి ఆసక్తికర ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.
- మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
శుక్రవారం టెక్సాస్‌లోని ఆర్లింగ్టన్‌లోని AT&T స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం నవంబర్ 16న శనివారం ఉదయం 6 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
టైసన్ బరువు 103.6 కిలోలు, జేక్ పాల్ బరువు 102.9 కిలోలు. టైసన్ 50-6 రికార్డును కలిగి ఉన్నాడు, ఇందులో 44 నాకౌట్‌లు ఉన్నాయి. అతడు గత 19 ఏళ్లలో ప్రొఫెషనల్ మ్యాచ్‌లో పాల్గొనలేదు. యూట్యూబర్ నుంచి ఫ్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన జేక్ పాల్ 9-1 రికార్డుతో ఉన్నాడు. ఇందులో 7 నాకౌట్ విజయాలు ఉండటం గమనార్హం. ఈ ఫైట్ కోసం పాల్ 40 మిలియన్ల యూఎస్ డాలర్లు అందుకోగా, టైసన్ 20 మిలియన్ యూఎస్ డాలర్లు అందుకోనున్నాడు.
- జేక్ పాల్‌ను ఎందుకు కొట్టాడు?
బాక్సింగ్ మ్యాచ్ ఫైనల్ వెయిట్-ఇన్ సమయంలో ఊహించని ఘటన జరిగింది. ఆర్లింగ్టన్‌లోని AT&T స్టేడియంలో భారీగా హాజరైన ప్రేక్షకుల ముందు పాల్‌ను టైసన్ చెంపదెబ్బ కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గురించి టైసన్ సన్నిహిత మిత్రుడు టామ్ పట్టి మాట్లాడుతూ, "బరువు కొలిచే సమయంలో టైసన్ బొటనవేలిని పాల్ తొక్కాడు. అందుకే టైసన్ చెంపదెబ్బ కొట్టాడు." అని చెప్పాడు. అయితే చెంపదెబ్బ కొట్టడాన్ని చాలా మంది నెటిజన్లు సమర్థిస్తున్నారు. దాన్ని ప్రతిచర్యగానే చూడాలని చెబుతున్నారు.