MS Dhoni IPL 2024:2024 ఐపీఎల్లో చెన్నై స్టార్ బ్యాటర్ ఎమ్ఎస్ ధోనీ ఫ్యాన్‌బేస్ అసాధారణమైందని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ అన్నాడు. ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో చెన్నై మ్యాచ్‌లకు తలా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో హాజరయ్యారు. హోం గ్రౌండ్, నాన్ హోం గ్రౌండ్ అని తేడా లేకుండా సీఎస్కే మ్యాచ్‌లు ఎక్కడ ఉంటే ఆ స్టేడియానికి ధోనీ ఫ్యాన్స్ పోటెత్తారు. నెం. 7 జెర్సీ ధరించి, 'ధోనీ ధోనీ' నామస్మరణతో మైదానాలను మార్మోగించారు. అయితే తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న లాంగర్ ధోనీ ఫ్యాన్‌బేస్ చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు.
'ధోనీకి అసాధారణమైన ఫ్యాన్‌బేస్ ఉంది. ఈ సీజన్లో చెన్నైతో మేం రెండు మ్యాచ్‌లు ఆడాం. ఒకటి లఖ్‌నవూ, రెండోది చెన్నైలో. అయితే లఖ్‌నవూ సీటింగ్ కెపాసిటీ 50వేలు. అందులో దాదాపు 48వేల మంది నెం. 7 జెర్సీ ధరించి ధోనీకి మద్ధతు తెలిపారు. మా హోం గ్రౌండ్లో ధోనీకి అంత ఆదరణ చూని నేను నమ్మలేకపోయా. ఇక చెన్నై వెళ్తే స్టేడియంలో 100 శాతం ధోనీ జెర్సీలే. నిజంగా నాకు నమ్మశక్యం కాలేదు' అని లాంగర్ అన్నాడు. కాగా, ఈ సీజన్లో చెన్నైతో అడిన రెండు మ్యాచ్‌ల్లో లఖ్‌నవూ నెగ్గింది. కాగా, లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ బ్యాట్ ఝలిపించాడు. 9 బంతుల్లోనే 28 పరుగులతో సత్తా చాటాడు. అందులో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్‌లో ధోనీ 220.55 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. మొత్తం 161 పరుగులు చేయగా, అందులో 14 ఫోర్లు, 13 సిక్స్‌లు ఉన్నాయి.