Longest Partnership in Test Cricket : క్రికెట్లో టెస్టులను సుదీర్ఘమైన ఫార్మాట్గా అభివర్ణిస్తారు. ఎందుకంటే ఈ ఫార్మాట్లో మ్యాచ్ ఫలితం తేలడానికి ఐదు రోజుల సమయం పడుతుంది. కొన్నిసార్లు వేగంగా ఫలితం తేలిపోవచ్చు. అయితే టెస్టుల్లో బ్యాటర్లు బంతులను స్వేచ్ఛగా ఆడొచ్చు. ఈ క్రమంలో భారీ భాగస్వామ్యాలు నెలకొల్పొచ్చు. అయితే మరో రెండు రోజుల్లో భారత్ - బంగ్లా టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఐదు జోడీలేవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కుమార్ సంగక్కర- మహేల జయవర్ధనే :టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రికార్డు శ్రీలంక మాజీ క్రికెటర్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనే పేరిట ఉంది. ఈ జోడీ 2006లో కొలంబో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచులో మూడో వికెట్కు 624 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ పార్ట్నర్షిప్లో జయవర్ధనే 374, సంగక్కర 287 పరుగులు చేశాడు. ఈ మ్యాచులో శ్రీలంక ఇన్నింగ్స్, 153 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సనత్ జయసూర్య- రోషన్ మహానామా :టెస్టు క్రికెట్లో రెండో అత్యధిక పార్టనర్ షిప్ రికార్డు శ్రీలంక మాజీ క్రికెటర్లు సనత్ జయసూర్య, రోషన్ మహానామా పేరిట ఉంది. వీరిద్దరూ 1997లో కొలంబో వేదికగా భారత్తో జరిగిన టెస్టులో రెండో వికెట్కు 576 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో జయసూర్య 340 , రోషన్ 225 పరుగులు చేశారు. ఈ మ్యాచులో శ్రీలంక మొత్తం 952 పరుగులు చేసింది.
మార్టిన్ క్రో- ఆండ్రూ జోన్స్ :టెస్టుల్లో మూడో అత్యధిక భాగస్వామ్యాన్ని న్యూజిలాండ్ మాజీ బ్యాటర్లు మార్టిన్ క్రో, ఆండ్రూ జోన్స్ నెలకొల్పారు. ఈ జోడి 1991లో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన టెస్టులో శ్రీలంకపై మూడో వికెట్కు 467 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో మార్టిన్ 299, జోన్స్ 186 పరుగులు చేశారు.