KKR vs LSG IPL 2024:2024 ఐపీఎల్లో కోల్‌కతా తొలిసారి లఖ్‌నవూపై విజయం నమోదు చేసింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. లఖ్‌నవూ నిర్దేశించిన 162 లక్ష్యాన్ని కేకేఆర్ 15.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించి ఈ సీజన్లో నాలుగో విక్టరీ కొట్టింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (89*; 47 బంతుల్లో 14×4, 3×6) హాఫ్ సెంచరీతో చెలరేగగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (38*, 38 బంతుల్లో 6×4) రాణించాడు. ఇక లఖ్‌నవూ బౌలర్లలో మోసిన్‌ఖాన్ ఒక్కడే రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
162 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు తొలి ఓవర్లోనే 22 పరుగులు వచ్చాయి. కానీ, రెండో ఓవర్లోనే సునీల్ నరైన్ (6) క్యాచౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత 3.1 వద్ద మరో యంగ్ బ్యాటర్ రఘువంశీ (7) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో పవర్‌ప్లే లోనే కేకేఆర్ రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో లఖ్‌నవూ కాస్త రేస్‌లోకి వచ్చినట్లు కనిపించింది. కానీ, ఫిలిప్ సాల్ట్ ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. అయ్యర్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ సాల్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు అయ్యర్ నెమ్మదిగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఇక మరో వికెట్ పడకుండా వీరిద్దరే జట్టును విజయ తీరాలకు చేర్చారు.