Ranji Trophy 2025 :రసవత్తరంగా జరిగిన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్స్ శుక్రవారం ముగిశాయి. ఫైనల్ ఆడబోతున్న టీమ్‌లు ఏవో తేలిపోయింది. ముంబయిని ఓడించి విదర్భ, గుజరాత్‌పై గెలిచి కేరళ ఫైనల్ చేరాయి. 74 ఏళ్ల చరిత్రలో తొలిసారి కేరళ ఫైనల్ ఆడబోతోంది. ఈ చారిత్రాత్మక విజయం వెనక రెండు పరుగుల ఆధిక్యం, హెల్మెట్ చేసిన మేలు ఉన్నాయంటే నమ్ముతారా? ఐదో రోజు మార్నింగ్ సెషన్‌లో ఈ అద్భుతం జరిగింది. అదేంటో తెలుసుకుందాం పదండి.
కేరళను కాపాడిన హెల్మెట్
ఐదో రోజు మార్నింగ్ సెషన్‌లో కేరళ స్పిన్నర్ ఆదిత్య సర్వతే రెండు వికెట్లు తీసి జోరు మీదున్నాడు. అతడు బౌలింగ్ చేస్తున్న సమయంలో గుజరాత్‌కు చెందిన అర్జాన్ నాగ్వాస్వాల్లా స్ట్రైక్‌లో ఉన్నాడు. ఆదిత్య సర్వతే ఓ లాపీ డెలివరీ వేసి, భారీ షాట్ ఆడేలా నాగ్వాస్వాల్లాను టెంప్ట్ చేశాడు. ఊహించినట్లుగానే బ్యాటర్ అటాకింగ్ షాట్‌కి వెళ్లాడు, కానీ బంతి షార్ట్ లెగ్ వద్ద ఉన్న ఫీల్డర్ సల్మాన్ నిజార్ హెల్మెట్‌కు తగిలింది. హెల్మెట్‌కు తగిలి గాల్లోకి లేచిన బంతిని సచిన్ బేబీ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో గుజరాత్ చివరి వికెట్ కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌట్ అయింది. కేరళకు మొదటి ఇన్నింగ్స్‌లో (457) రెండు పరుగుల ఆధిక్యం లభించింది.
రంజీ మొదటి సెమీఫైనల్
మొదటి సెమీ ఫైనల్లో టాస్ గెలిచిన తర్వాత కేరళ బ్యాటింగ్ ఎంచుకుంది. మహ్మద్ అజారుద్దీన్ 177 పరుగులు చేయడంతో 457 పరుగులు చేసింది. సచిన్ బేబీ 69, సల్మాన్ నిజార్ 53 అర్ధ శతకాలు సాధించి కీలక పాత్ర పోషించారు. గుజరాత్ బౌలర్ నాగ్వాస్వాల్లా మూడు వికెట్లు తీశాడు. గుజరాత్‌లో ప్రియాంక్ పంచల్ 148 పరుగులతో రాణించాడు. ఆర్య దేశాయ్ 73, జయమీత్ పటేల్ 79 పరుగులు చేశారు. దీంతో గుజరాత్ 455 పరుగులు చేసింది. కేరళ బౌలర్ జలజ్ సక్సేనా నాలుగు వికెట్లు తీశాడు.