Karnataka High Court Rejects Lakshya Sens Plea : బర్త్ సర్టిఫికేట్లను నకిలీ చేశారంటూ స్టార్ షట్లర్ లక్ష్య సేన్, అతని కుటుంబం అలాగే కోచ్ విమల్ కుమార్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయడానికి చేసిన అభ్యర్థనను తాజాగా కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. అయితే తాజాగా కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు మంగళవారం నిలిపివేసింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.
కోర్టును ఆశ్రయించిన లక్ష్యసేన్
బెంగళూరులోని ఎనిమిదో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ లక్ష్యసేన్, కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 19న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఎంజీ ఉమా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఈ ఎఫ్ఐఆర్లను కొట్టేయలేమని తీర్పునిచ్చారు.
'లక్ష్యసేన్‌ను వేధించడానికి కేసులు'
లక్ష్యసేన్‌ను వేధించడానికే ఫిర్యాదుదారులు ఉద్దేశపూర్వకంగా ఈ కేసులు పెట్టారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు ఎదుట వాదించారు. లక్ష్యసేన్‌పై ఫిర్యాదు నిరాధారమైనదని ఆరోపించారు. అయితే, కంప్లైంట్ చేసిన వ్యక్తి డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించారని, ఈ దశలో కేసును కొట్టివేయడం సరికాదంటూ హైకోర్టు వెల్లడించింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు లక్ష్యసేన్ తరఫు న్యాయవాదులు.