Ishan Kishan Shreyas Iyer BCCI Central Conract : టీమ్ ఇండియా ప్లేయర్స్‌కు సంబంధించిన 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్‌లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆదేశాలను పెడచెవిన పెట్టి దేశవాళీ టోర్నీలో పాల్గొనని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లపై బీసీసీఐ వేటు వేసింది. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి ఈ యంగ్ ప్లేయర్స్‌ను తొలగించింది. దీంతో ఇషాన్ కిషాన్, శ్రేయస్ అయ్యర్ భవిత్యవం ఏంటి? వీరు ఇక నుంచి టీమ్ ఇండియా జెర్సీని ధరించలేరా? కాంట్రాక్ట్ కోల్పోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? అన్న సందేహాలు క్రికెట్ అభిమానులకు కలుగుతున్నాయి.
సెంట్రల్ కాంట్రాక్ట్ అనేది ప్లేయర్స్‌కు ఎంతో కీలకం. దీన్ని కోల్పోతే ఆర్థికంగా, ఆట పరంగా వాళ్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే కాంట్రాక్ట్ పొందిన ప్లేయర్స్‌కు బీసీసీఐ నుంచి పెద్ద మొత్తంలో వేతనం అందుతుంది. గరిష్టంగా ఏ+ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ. 7 కోట్లను బీసీసీఐ చెల్లిస్తుంది.
ఇంకా జాతీయ క్రికెట్ అకాడమీకి (ఎన్సీఏ) ప్లేయర్స్ నేరుగా వెళ్లచ్చు. దీంతో పాటు సమగ్ర బీమా రక్షణ కూడా వీరికి ఉంటుంది. వైద్య ఖర్చులన్నింటినీ బోర్డే భరిస్తుంది. ఒకవేళ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నా ఆ ఆర్థిక నష్టాన్ని బీసీసీఐ భర్తీ చేస్తుంది. అలా ఆర్థికంగా ఉన్న ఈ లాభాలన్నింటీ శ్రేయస్, ఇషాన్ కోల్పోయినట్టే. ఇక గాయపడినప్పుడు చికిత్స తీసుకోవడానికి ఎన్సీఏకు వెళ్లాలంటే రాష్ట్ర బోర్డుల అనుమతి కూడా తీసుకోవాలి.