Irfan Pathan On Rohit Sharma :టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్టు నుంచి తప్పుకున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అతడి ఫామ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొని పోరాడాలని పఠాన్ సూచించాడు. సిడ్నీ టెస్టులో రాణించి కఠిన పరిస్థితుల నుంచి రోహిత్ బయటపడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు.
'సిడ్నీ టెస్టులో రోహిత్ రాణించాలి'
'సిడ్నీ టెస్టులో రోహిత్ ఎక్కువ పరుగులు చేసి టీమ్ఇండియాను గెలిపించాలి. నా అభ్యర్థనను రోహిత్ శర్మ పాటిస్తాడు. కఠిన పరిస్థితుల నుంచి పారిపోవద్దని రోహిత్ శర్మకు నా అభ్యర్థన. అతడు ఈ పరిస్థితుల నుంచి బయటపడి రాణించాలి. ఇది నా వ్యక్తిగత కోరిక. అయితే రోహిత్ ఫామ్‌లో లేడన్నది నిజం. కానీ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో రాణించాలి' అని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు.
కూర్పుపై పఠాన్
అలాగే సిడ్నీ టెస్టులో ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పుల గురించి పఠాన్ స్పందించాడు. మెల్ బోర్న్ టెస్టులో జట్టులో మార్పులు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. చివరి మ్యాచ్‌లో చాలా మార్పులు చేయడం అంత మంచిదికాదని తెలిపాడు.
దారుణంగా విఫలం
కాగా, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 3న సిడ్నీలో జరగబోయే టెస్టుకు రోహిత్ ను తప్పిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ ఫామ్ పై ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.