IPL 2025 Rishabh Pant Captaincy : లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు కూర్పుపై ఆ ఫ్రాంచైజీ సహ యజమాని, వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ జట్టులో రిషభ్ పంత్, పూరన్, మార్ క్రమ్, మిచెల్ మార్ష్ అనే నలుగురు నాయకులు ఉన్నారని వ్యాఖ్యానించారు. బలమైన మిడిల్ ఆర్డర్‌ను నిర్మించడమే లఖ్‌నవూ లక్ష్యమని తెలిపారు. లఖ్‌నవూ టీమ్ చాలా బలంగా ఉందని అభిప్రాయపడ్డారు.
'అది ప్రణాళికలో భాగమే' - "లఖ్‌నవూ క్యాంపులో నలుగురు నాయకులు ఉన్నారు. ఐపీఎల్ మెగావేలంలో దక్కించుకున్న ప్లేయర్ల విషయంలో సంతోషంగా ఉన్నాం. వేలంలో భారత పేసర్లను ఎక్కువగా తీసుకోవడం ఫ్రాంచైజీ ప్రణాళికలో భాగమే. మెగావేలాన్ని అద్భుతంగా మలుచుకున్నాం. మిడిలార్డర్, ఫినిషర్లతో జట్టును పటిష్ఠం చేయడంపై దృష్టి సారిస్తాం. నెంబర్ 3 నుంచి నంబర్ 8 వరకు మా టీమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అంతర్జాతీయ పేస్‌కు బదులుగా పూర్తిగా భారత పేస్, విధ్వంసరకర విదేశీ బ్యాటర్లతో జట్టును కూర్పు చేశాం." అని ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజీవ్ గోయెంకా వ్యాఖ్యానించారు.
'వారిది అదే మనస్తత్వం' - రిషభ్, పూరన్, మార్ క్రమ్, మిచెల్ మార్ష్ వంటి బలమైన నాయకత్వంలో లఖ్ నవూ జట్టు నిండి ఉందని గోయెంకా వ్యాఖ్యానించారు. వీరందరూ గెలవాలనే మనస్తత్వంతో ఉన్న ఆటగాళ్లని కొనియాడారు. అందుకే లఖ్‌నవూ టీమ్ పట్ల సంతోషంగా ఉన్నామని పేర్కొన్నారు. అయితే ఏ జట్టుకు పదికి 10 మంది సరైన ఆటగాళ్లు కుదురరని అభిప్రాయపడ్డారు. రిషభ్ పంత్ వచ్చే 10-12 ఏళ్ల లఖ్ నవూ సూపర్ జెయింట్స్ తరఫున ఆడతాడని ఆశిస్తున్నానని సంజీవ్ గోయెంకా వ్యాఖ్యానించారు.