IPL 2025 Retention Rules : ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తమ టీమ్‌లోని ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్ పాలకవర్గం తాజాగా అనుమతినిచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) కలిసి ఉంటుందని పేర్కొంది. జట్టు దగ్గర ఉండే మొత్తం రూ.120 కోట్లు అయితే ఆ అట్టిపెట్టుకున్న అయిదుగురి కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టాల్సివుంటుందని తెలిపింది. అయితే 2022లో జరిగే మెగా వేలంలో ఆయా జట్లకు నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకోవడానికి అవకాశమిచ్చారు.
ఇదిలా ఉండగా, రానున్న సీజన్ (2025) నుంచి లీగ్ మ్యాచ్‌లు ఆడేందుకు ఎంపికైన ఆటగాళ్లందరికీ రూ.7.50 లక్షల మ్యాచ్ ఫీజు (ప్రతి మ్యాచ్‌కు)ను అందించాలని ఆ సమావేశాంలో నిర్ణయించారు. అంటే అన్ని లీగ్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌కు అదనంగా రూ.1.05 కోట్ల ఆదాయం లభిస్తుందన్నమాట. ఇక ఒక జట్టు ఈ ఫీజుల కోసం మొత్తం రూ.12.60 కోట్లు ఖర్చు చేయాల్సివుంటుంది. వేలం పర్స్ రూ.120 కోట్లకు ఇది అదనం.
" ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న మొదటి ప్లేయర్‌కు వారు రూ.18 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రెండో ప్లేయర్‌కు రూ.14 కోట్లు, అలాగే మూడో ఆటగాడికి రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక నాలుగు, అయిదో ఆటగాణ్ని కూడా అట్టిపెట్టుకుంటే వారు తిరిగి వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఏ ఫ్రాంఛైజీ అయినా సరే అయిదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే వారికి రూ.45 కోట్లు మాత్రమే మిగులుతాయి. ఆర్‌టీఎం (RTM) సహా వేలంలో మరో 15 మందిని కొని జట్టును తయారు చేసుకోవడం కోసం ఆ సొమ్ము మాత్రమే ఉంటుంది" అంటూ ఓ సీనియర్ బీసీసీఐ, ఐపీఎల్ పాలకవర్గ సభ్యుడు చెప్పాడు.