IPL 2025 Auction Sunrisers Hyderabad Players :ఐపీఎల్ 2025 మెగా వేలంలో తొలి రోజు ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. అంచనాలు నిజమయ్యాయి. దాదాపుగా చాలా మంది ప్లేయర్స్ ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు ధరకు అమ్ముడుపోతున్నారు. రిషభ్ పంత్ కోసం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్లు ఖర్చు పెట్టగా, శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లు, వెంకటేశ్ అయ్యర్ కోసం కేకేఆర్ రూ.23.75 కోట్లు పెట్టి దక్కించుకున్నాయి. మొత్తంగా అలా తొలి రోజు తొలి రోజు 10 ఫ్రాంఛైజీలు కలిపి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం రూ.467.95 కోట్లు ఖర్చు చేశాయి. నాలుగు ఆర్టీఎం కార్డులను ఉపయోగించాయి.
ఈ 10 ఫ్రాంఛైజీలతో ఒకటైన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా మొదటి రోజు వేలంలో వ్యూహాత్మకంగానే వ్యవహరించింది! ఎస్‌ఆర్‌హెచ్ సీఈవో కావ్య మారన్ ఆచితూచి ఎనిమిది మంది ఆటగాళ్లను ఎంపిక చేసి దక్కించుకుంది.
బౌలింగ్ లైనప్ విషయానికొస్తే, మొదట అర్షదీప్ సింగ్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ గట్టిగానే ప్రయత్నించినప్పటికీ, ఆర్‌టీఎమ్‌తో పంజాబ్ కింగ్స్ అర్షదీప్ సింగ్‌ను తిరిగి దక్కించుకుంది. ఇక మహ్మద్ షమిని రూ. 10 కోట్లకు, హర్షల్ పటేల్‌ను రూ. 8 కోట్లకు సొంతం చేసుకుని బౌలింగ్ లైనప్‌ను పటిష్టంగా మార్చుకుంది సన్‌రైజర్స్.
బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత బలంగా మార్చుకునేందుకు పవర్ హిట్టర్ ఇషాన్ కిషన్ రూ. 11.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. రూ. 3.20 కోట్లు ఖర్చు పెట్టి యువ ఫినిషర్ అభినవ్ మనోహర్‌ను దక్కించుకుంది. ప్రధాన స్పిన్నర్ పాత్ర కోసం రాహుల్ చాహర్‌ను రూ. 3.20 కోట్లు, ఆడమ్ జంపా రూ. 2.40 కోట్లకు సొంతం చేసుకుంది. దేశీయ యువ ఆటగాళ్లు సిమర్‌జీత్ సింగ్‌ను రూ. 1.50 కోట్లు, అథర్వను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. మొత్తంగా తొలి రోజు కాస్త తక్కువ ధరలకే నాణ్యమైన ఆటగాళ్లను తన జట్టులోకి చేర్చుకుంది. రూ.45 కోట్లతో వేలంలోకి దిగి రూ.5.15 కోట్లను మిగుల్చుకుంది.