IPL 2024 Rohith Sharma : ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ రోహిత్ పేలవ ఫామ్‌తో టీమిండియా అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాడు. ఒకప్పుడు రోహిత్ వస్తున్నాడంటే వరుస హిట్టింగ్‌లు గుర్తుకొచ్చేవి. కానీ ప్రస్తుతం అతడి ఫామ్ ఒడుదొడుకులతో సాగుతున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అతడు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయట్లేదు. తన తొలి 7 ఇన్నింగ్స్‌లు మొత్తం కలిపి 297 పరుగులు చేసినప్పటికీ వరుసగా చివరి ఐదు ఐపీఎల్ మ్యాచ్‌లలో పేలవ ప్రదర్శన కనబరుస్తూ 33 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తంతు. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి బ్యాట్ సర్దేశాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ నర్దేశించిన 74 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా ముంబయి ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఓపెనర్‌గా రోహిత్ శర్మ మొదటి బంతికే 4 కొట్టి ఊపు మీద ఉన్నట్టు కనిపించాడు. ఆ తరువాత ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో షాట్ కొట్టబోయి క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ముంబయి జట్టు ఆశలపై మరోసారి నీళ్లు జల్లాడు.
అలా వరుస మ్యాచుల్లో ఫెయిల్ అవుతున్న రోహిత్ తన పేలవమైన ఫామ్‌తో టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ అందరినీ సందిగ్ధంలో పడేశాడు. దీంతో కొంతమంది క్రికెట్ అభిమానులు రోహిత్ పై విమర్శలు కురిపిస్తూ టీ20 వరల్డ్ కప్ టీమ్‌కు కెప్టెన్ కాకపోయుంటే జట్టులో స్థానం కూడా దక్కేది కాదని అంటున్నారు.