Ipl 2024 Reschedule Matches:2024 ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌ల షెడ్యూల్ మారింది. పలు కారణాల దృష్యా ఏప్రిల్ 17న ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన కోల్‌కతా నైట్‌రైడర్స్- రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌ను ప్రీపోన్ చేశారు. ఈ మ్యాచ్‌ను ఏప్రిల్ 16న అదే వేదికలో నిర్వహించనున్నారు. అదే విధంగా అహ్మదాహాద్ నరేంద్రమోదీ స్టేడియంలో ఏప్రిల్ 16న జరగాల్సిన దిల్లీ- గుజరాత్ మ్యాచ్‌ను మరుసటి రోజు (ఏప్రిల్ 17)కు మార్చారు.
అయితే ఏప్రిల్ 17న శ్రీ రామనవమి పండగ సందర్భంగా కోల్‌కతా మ్యాచ్ రీషెడ్యూల్ జరిగినట్లు తెలుస్తోంది. కోల్‌కతాలో రామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని సమాచారం. దీంతో భద్రత కారణాల దృష్యా కేకేఆర్- రాజస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందుకు జరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు బంగాల్ రాష్ట్రంలో ఏప్రిల్ 19న తొలి విడత లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. అయితే పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందే మ్యాచ్ ఉండడం వల్ల గేమ్‌ను ఏప్రిల్ 16కు లేదా ఏప్రిల్ 18 తర్వాత నిర్వహించాలని బంగాల్ క్రికెట్ అసోసియేషన్ తెలిపినట్లు తెలుస్తోంది. కానీ, దీనిపై బీసీసీఐ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇక ఈ రెండు మ్యాచ్‌లు మినహా టోర్నమెంట్లో అన్ని గేమ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి.