IPL 2024 RCB Dinesh karthik :టీ20 క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన దినేశ్ కార్తీక్(DK), మెరుపు ఇన్నింగ్స్‌లను ఇకపై ఫ్యాన్స్ చూడలేరు. ఎలిమినేటర్‌లో ఆర్సీబీ ఓడిపోయిన వెంటనే అతడు తన 38 ఏళ్ల వయస్సులో 16 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికాడు. అలానే అహ్మదాబాద్‌లో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆర్సీబీ ప్లేయర్‌ల నుంచి కార్తీక్ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నాడు.
ఐపీఎల్ 2024లో డీకే 15 మ్యాచుల్లో 326 పరుగులు చేశాడు. ఆర్సీబీ తరఫున చాలా మ్యాచుల్లో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అతని ధనా ధన్ బ్యాటింగ్ చూసి టీ20 వరల్డ్ కప్ 2024కు గట్టి పోటీ ఇస్తాడని భావించారు. కానీ కీపర్-బ్యాటర్ రోల్‌కు యంగ్ ప్లేయర్స్ చాలా మంది పోటీ పడటంతో డీకేకి ఛాన్స్ దక్కలేదు. కార్తీక్ ఇప్పటివరకు ఇండియా తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడాడు.
- 20 ఏళ్ల కెరీర్‌లో అతి తక్కువ అవకాశాలు
కార్తీక్, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేసి దాదాపు 20 ఏళ్లు పూర్తయింది. 20 ఏళ్లలో అతి తక్కువ మ్యాచ్‌లు ఆడటానికి కారణం ధోనీ అని చెప్పవచ్చు. ధోనీ కన్నా కార్తీక్ నాలుగేళ్లు చిన్నవాడు. కానీ టెస్టులు, వన్డేల్లో ధోనీ కంటే ముందే టీమ్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. టీ20ల్లో మాత్రం ఇద్దరూ ఒకేసారి అరంగేట్రం చేశారు. ధోనీ బ్యాటింగ్, కీపింగ్‌లో రాణించడంతో, కొంత కాలానికే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించడంతో, కార్తీక్ అవకాశాలు తగ్గిపోయాయి.
- సొంత రాష్ట్రానికి ఆడలేకపోయాడు
ఐపీఎల్‌లో కార్తీక్ మొత్తం ఆరు ఫ్రాంచైజీలకు ఆడాడు. మొత్తం 257 మ్యాచుల్లో 4,842 రన్స్ చేశాడు. పంజాబ్, ముంబయి, ఆర్సీబీ, గుజరాత్ లయన్స్, కోల్‌కతా, దిల్లీ తరఫున ఆడాడు. అయితే తన సొంత రాష్ట్రం సీఎస్కే తరఫున ఆడే అవకాశం రాలేదు. ఇదే అతడి కెరీర్‌లో లోటు అని చెప్పొచ్చు. అయితే ప్రతీ సీజన్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తూ వచ్చిన డీకే ఈసారి మరింత చెలరేగిపోయాడు. కానీ దురదృష్టవశాత్తు ఆర్సీబీ ఎలిమినేటర్‌లో నిష్క్రమించాల్సి వచ్చింది.
- ఆ ఇన్నింగ్స్ అద్భుతం
ఏదైనా కారణాలతో ధోనీ అందుబాటులో లేనప్పుడే, కార్తీక్ టీమ్‌లోకి వచ్చేవాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఛాన్స్‌లు తగ్గడంతో కార్తీక్‌కు ఐపీఎల్ కీలక వేదికగా మారింది. టీమ్ ఇండియా తరఫున వచ్చిన అవకాశాలను డీకే పెద్దగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కొన్నిసార్లు మాత్రమే ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి ఇన్నింగ్స్‌లలో నిదహాస్ ట్రోఫీ(2018) ఇకటి. ఫైనల్లో బంగ్లాదేశ్‌పై కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులతో చేసి, భారత్‌కు కప్ అందించాడు. అప్పటినుంచే ‘ఫినిషర్’గా డీకే పేరు మారుమోగిపోయింది. కానీ టీ20 ప్రపంచకప్ 2022లో ఘోరంగా విఫలమై నిరాశపరిచాడు.
- కామెంటేటర్‌గా డీకే
దినేశ్ కార్తిక్‌ను ఇప్పటికే చాలా సార్లు అభిమానులు కామెంటేటర్ రోల్‌లో చూశారు. ఐపీఎల్ మినహా, టీమ్ ఇండియా మ్యాచులకు కామెంట్రీ చేస్తున్నాడు. ఇక నుంచి ఐపీఎల్‌లో కూడా కామెంటేటర్‌గా కనిపించే అవకాశం ఉంది.