IPL 2024 KL Rahul : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో మ్యాచ్ అనంతరం లఖ్‌నవూ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రస్తుతం నెట్టింట్లో వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇందులో గోయెంకా కోపంగా రాహుల్‌తో ఏదో అన్నట్టుగా కనిపిస్తోంది. అప్పటికీ రాహుల్ కూడా ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా గోయెంకా గ్యాప్ లేకుండా అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే కాసేపటి తర్వాత కోచ్ జస్టిన్ లాంగర్ వీరి మధ్యలోకి రాగా కేఎల్ రాహుల్ అక్కడి నుంచి నిరాశగా వెళ్లిపోయాడు. చాలా సేపు పాటు ఈ సంభాషణ కొనసాగింది.
ఇది చూసిన ఫ్యాన్స్ ఇలాంటి జట్టులో ఉండటం కరెక్ట్ కాదని అంటూ రాహుల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటివి ఏమైనా ఉంటే పబ్లిక్, మీడియా ముందు కాకుండా నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు. అయినా ఓ స్టార్ క్రికెటర్‌తో అలా మాట్లాడటం సరైన పద్ధతి కాదంటూ సంజీవ్ గోయెంకాపై మండిపడుతున్నారు. కానీ వాస్తవానికి వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటనేది క్లారిటీగా తెలీదు. దీనిపై స్పష్టత రావాలంటే లఖ్‌నవూ యాజమాన్యం స్పందించాల్సిందే.