IPL 2024 LSG Mayank Yadav :లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు బ్యాడ్ న్యూస్. సీజన్ మధ్యలో మరోసారి మయాంక్ యాదవ్ గాయానికి గురికావడం ఆ జట్టును చిక్కుల్లో పడేసింది. పొత్తి కడుపు కండరాల గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు సైతం అతడు అందుబాటులో ఉండడేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆడింది నాలుగు ఐపీఎల్ మ్యాచ్‌లే అయినా ఫ్యూచర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ స్పీడ్ గన్ ఇటీవలే గాయం నుంచి కోలుకుని ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు. మూడు ఓవర్లు వేసి 31 పరుగులిచ్చిన మయాంక్ నాలుగో ఓవర్‌లో తొలి బంతిని మొహమ్మద్ నబీకి వేసి అనంతరం గాయంతో మైదానం వీడాడు.
అయితే బీసీసీఐ మయాంక్ యాదవ్‌కు బౌలింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని భావిస్తుందని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే అతనికి నేషనల్ క్రికెట్ అకాడమీలోని మెడికల్ టీమ్ నుంచి మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉమ్రాన్ మాలిక్, విద్వత్ కావేరప్ప, వైశాక్ విజయ్ కుమార్, యశ్ దయాల్, ఆకాశ్ దీప్ లాంటి యువ క్రికెటర్లకు బౌలింగ్ కాంట్రాక్ట్ అప్పగించింది బీసీసీఐ.
కాగా,అరంగ్రేట్ మ్యాచ్ లోనే 155 కి.మీ వేగంతో బంతులు సంధిస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు మయాంక్. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులతో జరిగిన మ్యాచ్‌లలో మూడేసి వికెట్ల చొప్పున పడగొట్టి సత్తా చాటాడు. రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత జరిగిన గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో గాయపడి ఆటకు దూరమయ్యాడు. ఒకే ఓవర్ బౌలింగ్ వేసిన మయాంక్‌కు పొత్తికడుపులో కండరాలు నొప్పి కలగడంతో మూడు వారాల పాటు గేమ్ కు దూరమయ్యాడు. అయితే రీఎంట్రీ ఇచ్చిన ముంబయితో మ్యాచ్‌లో మళ్లీ గాయపడటం అటు లఖ్‌నవూ ఫ్యాన్స్‌లోనూ, ఇటు మయాంక్ అభిమానుల్లోనూ తీవ్రమైన నిరాశను నింపింది.
కెప్టెన్ కేఎల్ రాహుల్ ఏమంటున్నాడంటే? - "నేను అతనితో పూర్తిగా మాట్లాడలేదు. ముంబయితో ఆడిన మ్యాచ్ నాలుగో ఓవర్ మొదటి బంతి వేయగానే , కాస్త నొప్పిగా ఉందని చెప్పాడు. మిగిలిన 5 బంతులు బౌలింగ్ వేసి రిస్క్ తీసుకోవద్దని సూచించాను. ఇప్పటికే మెడికల్ టీమ్‌ను, ఫిజియోలను వీలైనంత త్వరగా రెడీ చేయాలని రిక్వెస్ట్ చేశాను. అతను చాలా చిన్న వయస్సులో ఉన్నాడు. అలాంటి క్రికెటర్లను కాపాడుకోవాలి." అని పేర్కొన్నాడు.