IPL 2024 KKR captain Shreyas Iyer : రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి ఓడిపోయి నిరాశలో ఉన్న కోల్‌కత్తా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మరో షాక్ తగిలింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం తొలిసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన కారణంగా శ్రేయస్ అయ్యర్‌కు ఈ జరిమానా విధించినట్లు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇకపోతే ఇప్పటికే ఈ టోర్నీలో గిల్, రిషభ్ పంత్, సంజు శాంసన్‌లపై స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ కొరడా ఝళిపించిన సంగతి తెలిసిందే.
కాగా, తొలిసారి స్లో ఓవర్ రేట్ తప్పిదానికి కెప్టెన్ రూ.12 లక్షలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అదే పొరపాటును మళ్లీ చేస్తే రెట్టింపు జరిమానా అంటే రూ.24 లక్షలు చెల్లించాలి. అలానే ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా తుది జట్టులోని 11 మందికి కూడా రూ.6 లక్షల చొప్పున లేదా వారి మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం ఏది తక్కువైతే అది ఫైన్‌గా విధిస్తారు. ఒకవేళ ఇదే సీజన్‌లో మూడోసారి తప్పిదానికి పాల్పడితే జరిమానా రూ.30 లక్షలతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా కూడా నిషేధం విధిస్తారు.
ఆఖరి బంతికి విజయం - ఇక రాజస్థాన్ - కోల్‌కతా మ్యాచ్ విషయానికొస్తే మొదట బ్యాటింగ్ చేసిన అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో ఆఖరి బంతి వరకు పోరాడినా రాజస్థాన్ ఓటమి ఖాయమని అందరూ అనుకున్న వేళ జోస్ బట్లర్ వీరోచిత శతకంతో విజయం అందించాడు. ఫలితంగా కోల్‌కత్తా రెండు వికెట్ల తేడాతో ఓడిపోయి పరాజయం పాలైంది.