IPL 2024 Impact Player :ప్రస్తుతం ఐపీఎల్‌లో అమలవుతున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ చుట్టూ తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల మాజీ క్రికెటర్లు మైఖేల్ వాన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో ఓ య్యూటూబ్ ఛానెల్‌లో ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లోపాలను ప్రస్తావించాడు. ఆల్ రౌండర్లకు జరుగుతున్న నష్టాన్ని ఎత్తిచూపాడు. అనంతరం చాలా మంది మాజీ క్రికెటర్లు, కోచ్‌లు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి మాట్లాడుతున్నారు. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో లేని రూల్ ఐపీఎల్‌లో ఎందుకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే తాజాగా రోహిత్ వ్యాఖ్యలతో భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ కూడా ఏకీభవించాడు. అలానే గత సీజన్‌లో తమిళనాడు ప్రధాన కోచ్‌గా పనిచేసిన ముంబయి మాజీ వికెట్ కీపర్ సులక్షణ్ కులకర్ణి మాట్లాడుతూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ బౌలర్లకు పరిస్థితులను కష్టతరం చేస్తోందని, డొమెస్టిక్ ఆల్‌రౌండర్ల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుందని అభిప్రాయపడ్డాడు.
అంతే కాకుండా దేశవాళీ క్రికెట్‌ను మెరుగుపరచడానికి సూచనలు అడిగారని, వచ్చే సీజన్ నుంచి ముస్తాక్ అలీ T20 ట్రోఫీలో 'ఇంపాక్ట్ ప్లేయర్' నియమాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసినట్లు కులకర్ణి పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో, టీ20 వరల్డ్ కప్‌లో లేనీ ఈ రూల్ ఐపీఎల్‌లో అవసరం ఏంటని ప్రశ్నించారు.
ఆల్‌రౌండర్‌లకు తీవ్ర నష్టం
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ నష్టాలను కులకర్ణి వివరించారు. "ఈ రూల్‌తో డొమెస్టిక్ క్రికెట్‌లో ఆల్‌రౌండర్లను డెవలప్ చేయలేం. శివమ్ దూబే ఉదాహరణ చూడండి. ఈ సీజన్‌లో రంజీ ట్రోఫీలో ముంబయి తరఫున బౌలింగ్ చేసి, ఐదు మ్యాచ్‌లలో 12 వికెట్లు తీశాడు. ఈసారి IPLలో ఒక్క బంతి కూడా వేయలేదు. అతను ఐపీఎల్‌లో బౌలింగ్ చేయకపోతే, టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా టీమ్‌ఇండియాకు ఎలా ఎంపిక కాగలడు. అలానే మధ్యప్రదేశ్ తరఫున వెంకటేశ్ అయ్యర్ 8 మ్యాచ్‌లలో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అతనికీ బౌలింగ్ అవకాశం లేదు. ఐపీఎల్‌లో బౌలింగ్ చేస్తున్న ఏకైక భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రమే." అని పేర్కొన్నారు.