IPL 2024 CSK VS Delhi Capitals Captain Rishab Pant :టీమ్ఇండియా యంగ్ వికెట్ కీపర్, దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ - 2022 చివర్లో రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాిణాలతో బయట పడిన సంగతి తెలిసిందే. అప్పుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. చాలా శస్త్ర చికిత్సలు కూడా జరిగాయి. చాలా కాలం పాటు నడవలేకపోయాడు. దీంతో అతడిని మళ్లీ మైదానంలో చూడగలమా? అతడు మునుపటిలా బ్యాట్‌ను ఝళిపించగలడా? అనే అనుమానాలు చాలా మందిలో రేకెత్తాయి. కానీ పంత్ సంకల్ప బలం అతడిని నిలబెట్టింది.
గాయాలు అతడిని ఏమీ చేయలేకపోయాయి. వాటిని దాటి అతడు ఆటలోకి తిరిగొచ్చాడు. ఈ ఐపీఎల్ సీజన్‌తోనే పోటీ క్రికెట్లోకి పునరాగమనం చేశాడు. దీంతో అందరి దృష్టి అతడిపైనే పడింది. అయితే తొలి రెండు మ్యాచుల్లో వరుసగా 18, 28 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. కానీ తాజాగా ఇప్పుడు వైజాగ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం మునపటి పంత్‌ను చూపించాడు. ఒకప్పటిలా ఆడుతూ బ్యాట్‌తో చెలరేగాడు. తనదైన శైలిలో ఒంటి చేతి సిక్సర్‌ను కూడా బాది ఆకట్టుకున్నాడు. 159.38 స్ట్రైక్ రేటుతో 51 పరుగులు చేశాడు.
జడేజా బౌలింగ్‌లో మోకాలును కిందికి ఆనించి మరి బాదిన షాట్ అయితే దద్దరిల్లిపోయింది. యార్కర్లతో డేంజరస్‌గా మారిన పతిరన బౌలింగ్‌లోనూ అతడు భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీ బాది జట్టు ఇన్నింగ్స్‌లో కీలకంగా వ్యవహరించాడు. ఇక ఇది చూసిన క్రికెట్ ప్రేమికులు, ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. అతడు తిరిగి మునపటిలా పరుగులు పారించడం దిల్లీ క్యాపిటల్స్‌కే కాదు టీమ్ ఇండియాకూ సంతోషాన్ని కలిగించే విషయం అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో పంత్ ఇదే జోరు కొనసాగిస్తూ ముందుకెళ్తే జాతీయ జట్టులోకి తిరిగి రావడం ఖాయమనెే చెప్పాలి.