IPL 2024 Chennai Super Kings : కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబయ ఇండియన్స్ వంటి స్ట్రాంగ్ టీమ్‌లను ఓడించి వరుస విజయాలతో జోరు మీదున్న చెన్నై సూపర్ కింగ్స్‌కి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ఝలక్ ఇచ్చింది. ఏప్రిల్ 19న శుక్రవారం లఖ్‌నవూ ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై లఖ్‌నవూ సూపర్ విక్టరీ అందుకుంది. వాస్తవానికి ఈ సీజన్‌లో హోమ్ గ్రౌండ్‌లో బలంగా కనిపిస్తున్న సీఎస్కే, ఇతర పిచ్‌లపై సత్తా చాటలేకపోతోంది. బయట పిచ్‌లపై ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒక్క గేమ్‌లో మాత్రమే విజయం అందుకుంది.ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో ఏడు మ్యాచ్‌లలో 4 విజయాలతో చెన్నై మూడో స్థానంలో ఉంది. ఆ నాలుగు గెలుపుల్లో 3 చెన్నై హోమ్ గ్రౌండ్‌లో సాధించినవి కావడం గమనార్హం. ఎందుకు ఇలా జరుగుతోంది? బయటక పిచ్‌లపై ఆడుతున్నప్పుడు సీఎస్కేకి ఎదురవుతున్న సమస్యలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
ఓపెనింగ్‌లో సమస్య
చెన్నైకి సాలిడ్ ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ కూడా లభించడం లేదు. వైజాగ్‌లో దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనింగ్ జోడీ కేవలం ఒక ఓవర్ మాత్రమే కొనసాగింది. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో 3.1 ఓవర్లకి ముగిసింది. శుక్రవారం లఖ్‌నవూలో ఓపెనర్ రచిన్ రవీంద్ర అవుట్ అయ్యే సమయానికి చెన్నై నాలుగు పరుగులే చేసింది. వాంఖడేలో ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఓపెన్ అజింక్య రహానే అవుట్ అయ్యే సమయానికి సీఎస్కే స్కోరు 8 మాత్రమే. అయితే ముంబయిపై చెన్నై గెలిచింది.
భారీ టార్గెట్‌లు ఎక్కడ?
ఓపెనింగ్ జోడీ విఫలమవుతుండటం వల్ల చెన్నై జట్టు భారీ టార్గెట్ సెట్ చేయలేకపోతోంది. అజింక్యా రహానే, రచిన్ రవీంద్ర, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మొదటి మూడు పొజిషన్‌లలో ఆడుతున్నారు. కానీ ఎవరూ పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. దీంతో మిగతా బ్యాటింగ్ లైనప్‌పై చాలా భారం పడుతుంది. దిల్లీ మ్యాచ్‌లో 192 పరుగులు ఛేజింగ్ చేస్తూ ఇరవై ఓవర్లలో 171/6 సాధించారు. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో కేవలం 165 పరుగుల టార్గెట్ సెట్ చేశారు. శుక్రవారం లఖ్‌నవూకి కూడా 176/6 లక్ష్యం నిర్దేశించారు.