Rohit Sharma Champions Trophy :దాయాది దేశం పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. 1996 తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న తొలి ఐసీసీ టోర్నమెంట్ కావడం వల్ల ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేస్తోంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఓపెనింగ్ సెర్మనీ ఉండే అవకాశం ఉంది. వార్మప్ మ్యాచ్లను బట్టి తేదీల్లో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.
పీసీబీ అసహనం
అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభ వేడుకల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొనడం లేదన్న వార్తలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అసహనం వ్యక్తం చేసింది. మెగా టోర్నీకి ముందు కెప్టెన్ల ఫొటోషూట్, ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ వంటి కార్యక్రమాల్లో రోహిత్ హాజరవుతారని భావించినప్పటికీ, బీసీసీఐ ఆయన పాకిస్థాన్ ప్రయాణంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంపై పీసీబీ స్పందించింది.
"బీసీసీఐ క్రికెట్‌లోకి రాజకీయాలను తీసుకువస్తోంది. ఇది ఆటకు ఏమాత్రం మంచిది కాదు. భారత జట్టును పాకిస్థాన్ పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ప్రారంభోత్సవానికి టీమ్ ఇండియా కెప్టెన్ను పంపేందుకు ఇష్టపడడం లేదు. ఇప్పుడు ఆతిథ్య దేశం పేరును వారి జెర్సీపై ముద్రించకూడదని అనుకుంటోందని తెలుస్తోంది" అని పీసీబీ అధికారి ఒకరు బీసీసీఐపై అసహనం వ్యక్తం చేశారు.