Centuries In Boxing Day Tests :బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా చారిత్రక మెల్‌బోర్న్ క్రికెడ్ గ్రౌండ్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ గురువారం (డిసెంబరు 26) నుంచి జరగనుంది. ఇప్పటికే 1-1తో సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు)పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బాక్సింగ్ డే టెస్టుల్లో ఇప్పటివరకు సెంచరీలు బాదిన టీమ్ఇండియా ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.
- సచిన్ :టీమ్ఇండియా మాజీ దిగ్గజం సచిన్ తెందూల్కర్ 1999లో మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో సెంచరీ(116) బాదాడు. ఆసీస్ దిగ్గజాలు గ్లెన్ మెక్ గ్రాత్, షేన్ వార్న్ వంటి బౌలింగ్‌కు ఎదుర్కొని దూకుడైన స్ట్రోక్ ప్లేతో సచిన్ శతకం చేశాడు.
- వీరేంద్ర సెహ్వాగ్ :2003లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ 195 పరుగులు చేశాడు. త్రుటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. తనదైన దూకుడుతో బ్యాటింగ్ చేసి ఆసీస్ దిగ్గజ బౌలర్ల ఓవర్లలో సైతం సెహ్వాగ్ చెలరేగిపోయాడు.
- విరాట్ కోహ్లీ :2014లో మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో టీమ్ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ శతకం బాదాడు. ఆసీస్ బౌలర్లను తన టెక్నిక్‌తో ఎదుర్కొంటూ 169 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ పరుగుల వరద పారించాడు.
- అజింక్య రహానే :2014లో మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత ఆటగాడు అజింక్య రహానే సెంచరీ (147) చేశాడు. ఈ సెంచరీతో టీమ్ఇండియాను రహానే ఆదుకున్నాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అలాగే రహానే కెరీర్ బెస్ట్ సెంచరీల్లో ఇదొకటిగా నిలిచిపోయింది.
- ఛెతేశ్వర్ పుజారా :2018లో మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను పుజారా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో నిలకడగా ఆడుతూ సెంచరీ బాదాడు. దీంతో మ్యాచ్ భారత వశమైంది.
- రహానే :2020లో మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అజింక్య రహానే సారథ్యంలోని టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో కెప్టెన్ రహానే సెంచరీ(112) చేశాడు. విరాట్ కోహ్లీ మ్యాచ్‌కు దూరమవ్వడం వల్ల బాక్సింగ్ డే టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే టీమ్ఇండియాను గెలుపుతీరాలకు చేర్చాడు.