Rishabh Pant Helps Student:సాధారణంగా క్రికెట్ స్టార్‌లను తమ ఫ్యాన్స్ ఎక్కువగా సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు, టీ షర్టులు అడుగుతుంటారు. తాజాగా ఓ అభిమాని మాత్రం టీమ్‌ఇండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌ని ఆర్థిక సాయం చేయాలని కోరాడు. ఇంజనీరింగ్ కోర్సు చేయడానికి క్రౌడ్ ఫండింగ్‌లో సాయం చేయాలని ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో పంత్‌ను ట్యాగ్ చేస్తూ అడిగాడు. దీనికి పంత్ కూడా రెస్పాండ్ అయ్యి సాయం చేశాడు. అయితే పంత్ ఇచ్చిన డబ్బును తాను తిరిగి చెల్లిస్తానని సదరు అభిమాని ప్రకటించాడు. అసలు ఏమైదంటే?
కార్తికేయ మౌర్య అనే విద్యార్థి 'కార్తికేయ మౌర్య. చండీగఢ్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదువుతున్నా. నా కుటుంబంపై ఆధారపడకుండా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగిస్తున్నా. గత కొన్ని నెలలుగా స్థిరమైన ఉపాధి లేక నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. మీ సాయం నా జీవితాన్ని మార్చగలదు' అంటూ పంత్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. దీనికి పంత్ స్పందించాడు. ఆ విద్యార్ధికి సాయం చేశాడు. 'మీ కలలను నేరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉండండి. దేవుడు మంచి ప్రణాళికలు సిద్ధం చేసే ఉంటాడు' అంటూ పంత్ రీపోస్ట్ చేశాడు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఆ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'జాతీయ స్థాయి ఆటగాడిని మోసం చేయడానికి సిగ్గు లేదా?' అంటూ అతడిపై ట్రోల్ చేశారు. దీనికి స్పందించిన సదరు విద్యార్థి 'ఇంత ద్వేషాన్ని భరించలేను. కెట్టోలో రిఫండ్ చేసే అవకాశం లేదు. వాళ్లకు మెయిల్ చేశాను. అనుమతి రాగానే ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తాను. క్షమించండి!' అని 'ఎక్స్' వేదికగా పోస్టు చేశాడు. అయితే ఆ విద్యార్థికి సంబంధించిన వాస్తవిక గుర్తింపును తెలపకపోవడం గమనార్హం.