Ind W vs Ban W Asia Cup 2024:మహిళల ఆసియా కప్ 2024లో టీమ్ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. బంగ్లా నిర్దేశించిన 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని హర్మన్ సేన 11 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోకుండా (83-0) ఛేదించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (55 పరుగులు, 39 బంతుల్లో; 9x4, 1x6), షఫాలీ వర్మ (26 పరుగులు, 28బంతుల్లో; 2x2) మ్యాచ్‌ను ముగించారు. ఇక బంగ్లా పతనాన్ని శాసించిన బౌలర్ రేణుకా సింగ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (32 పరుగులు) టాప్ స్కోరర్. ఓపెనర్లు దిలారా అక్తర్ (6 పరుగులు), ముర్షిదా ఖతున్ (4 పరుగులు)సహా మరో ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. టీమ్ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ, ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు. రేణుకా సింగ్, రాధా యాదవ్ చెరో 3, పూజా వస్త్రకార్, దీప్తీ శర్మ తలో 1 వికెట్ పడగొట్టారు.
పాకిస్థాన్‌తో ఫైనల్!
ఈ టోర్నీలో ఓటమి లేకుండా దూసుకెళ్తున్న హర్మన్‌సేన తాజా విజయంతో ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక రెండో సెమీఫైనల్ (శ్రీలంక- పాకిస్థాన్) విజేతతో టీమ్ఇండియా ఆదివారం ఫైనల్లో తలపడనుంది. ఒకవేళ రెండో సెమీస్‌లో పాకిస్థాన్ నెగ్గితే ఫైనల్ మరింత రసవత్తరంగా మారుతుంది. భారత్- పాకిస్థాన్ జట్లతో ఫైనల్ హైవోల్టేజ్ మ్యాచ్‌గా మారడం పక్కా. కాగా, లీగ్ స్టేజ్‌లో ఇప్పటికే పాకిస్థాన్‌ను ఎదుర్కొన్న టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక తాజా ఓటమితో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.