Ind vs SL 1st ODI:శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ క్వీన్‌స్వీప్ చేసి జోరుమీదున్న టీమ్ఇండియా వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో వన్డే సిరీస్ శుక్రవారం ప్రారంభం కానుంది. సమష్ఠిగా రాణించి వన్డేల్లో కూడా లంకేయులపై పైచేయి సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. టీమ్ ఇండియా బలాలు, జట్టు అంచనా తెలుసుకుందాం పదండి.
జట్టులోకి హిట్‌మ్యాన్, కింగ్ కోహ్లీ
భారత్ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో శుక్రవారం తొలి వన్డే ఆడనుంది. టీ20 వరల్డ్‌కప్ విజయం తర్వాత విశ్రాంతి తీసుకుని తిరిగి జట్టులో చేరిన కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వచ్చారు. వీరిద్దరూ మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. స్టార్ ప్లేయర్లు అంతా అందుబాటులోకి రావడం వల్ల వన్డే జట్టు కూర్పు కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ కు కాస్త సవాల్ అనే చెప్పాలి.
జట్టు కూర్పే పెద్ద సవాల్
టీమ్ఇండియా బ్యాటర్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లో ఎవరిని వికెట్ కీపర్‌గా తీసుకోవాలన్నది మేనేజ్ మెంట్ ముందున్న పెద్ద సవాల్. బ్యాటింగ్‌లో ఆరో స్థానం కోసం శివమ్ దూబె, రియాన్ పరాగ్ మధ్య పోటీ నెలకొంది. ఇక రోహిత్, కోహ్లీ ప్రదర్శనపై కోచ్ గంభీర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత వీరిద్దరూ ఇప్పటివరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. మళ్లీ వన్డే జట్టులో కొచ్చిన రోహిత్, కోహ్లీ తమ రీఎంట్రీలో అదరగొట్టాలని భావిస్తున్నారు.
సూపర్ ఫామ్‌లో భారత్- ఢీలా పడిన లంకేయులు
రోహిత్, కోహ్లీ, గిల్‌తో టీమ్ఇండియా టాపార్డర్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. వీరితోపాటు మిడిలార్డర్ బ్యాటర్లు రాణిస్తే భారత్ మంచి స్కోరు చేసే అవకాశం ఉంది. అలాగే సిరాజ్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ వంటి బౌలర్లు మంచి ప్రదర్శన చేస్తే టీమ్ ఇండియాకు తిరుగుండదు. ఇక స్వదేశంలో టీ20 సిరీస్‌ను కోల్పోయిన శ్రీలంక వన్డేల్లో రాణించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.