India Vs England 5th Test :ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీమ్ఇండియా 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 473/8 స్కోరుతో నిలిచింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ (4/170) నాలుగు వికెట్లు తీసినప్పటికీ, భారత జట్టును నియంత్రించలేకపోయాడు. ప్రస్తుతం క్రీజ్‌లో కుల్‌దీప్ యాదవ్ (27*), బుమ్రా (19*) ఉన్నారు.
మ్యాచ్ సాగిందిలా :
ఓవర్‌నైట్ 135/1 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియాకు మంచి ఇన్నింగ్స్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా భారీ లీడ్‌తో దూసుకెళ్లింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు స్కోర్ చేసింది. అంతకుముందు రోహిత్ శర్మ 154 బంతుల్లో సెంచరీ (103) అందుకున్నాడు. ఇక శుభ్‌మన్ గిల్ (110) కూడా శతకంతో చెలరేగిపోయాడు. అలా రెండో వికెట్ సమయానికి రోహిత్, గిల్ ఏకంగా 161 పరుగులు పార్ట్నర్షిప్ జోడించారు. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చేతికి రోహిత్ చిక్కాడు. ఈ క్రమంలో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు.
ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ కూడా ఔటవ్వడం వల్ల టీమ్‌ఇండియా ఇబ్బందుల్లో పడినట్లు అనిపించింది. కానీ యంగ్ ప్లేయర్స్ దేవదుత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) అర్ధశతకాలతో రాణించి జట్టును గట్టెక్కించారు. అలా తొలి ఐదుగురు బ్యాటర్లు 50+ స్కోర్లు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.