Ind vs Eng 3rd ODI :ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో టీమ్ఇండియా భారీ స్కోర్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (112 పరుగులు) సెంచరీతో అలరించాడు. విరాట్ కోహ్లీ (52 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (78 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. కే ఎల్ రాహుల్ (40 పరుగులు) ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 4, మార్క్ వుడ్ 2, జో రూట్, మహ్మూద్, గస్ అట్కిసన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. గతమ్యాచ్ సెంచరీ హీరో కెప్టెన్ రోహిత్ శర్మ (1) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. వుడ్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడబోయి, కీపర్‌కు చిక్కాడు. ఆ తర్వాత విరాట్‌తో కలిసి గిల్ భాగస్వామ్యం నిర్మించాడు. రన్‌రేట్ 6కు తగ్గకుండా క్రమంగా పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు.
హాఫ్ సెంచరీ తర్వాత విరాట్ (52) 18.6 ఓవర్ వద్ద ఔటయ్యాడు. రషీద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 116 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత గిల్‌తో శ్రేయస్ అయ్యర్ జతకట్టాడు. అయ్యర్ కూడా అర్థ శతకంతో రాణించాడు. హార్దిక్ పాండ్య (17 పరుగులు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. వాషింగ్టన్ సుందర్ (14), అక్షర్ పటేల్ (13), హర్షిత్ రాణా (13) పరుగులు చేశారు. ఆఖరి బంతికి అర్ష్‌దీప్ సింగ్ (2) రనౌట్‌తో భారత్ ఆలౌటైంది.