India vs Australia Finals : భారత క్రికెట్ అభిమానులను మరోసారి నిరాశలోకి నెట్టేసింది ఆస్ట్రేలియా. ఇంకా చెప్పాలంటే గత 8 నెలల్లో ఏకంగా మూడుసార్లు అంతులేని బాధను మిగిల్చింది. గతేడాది రెండుసార్లు టీమ్ ఇండియాకు ఐసీసీ ట్రోఫీ దక్కకుండా చేసింది. ఇప్పుడేమో ఈ ఏడాది అండర్ - 19 టీమ్‌పై ఆధిపత్యం చెలాయించి వరల్డ్ కప్‌ను ఎగరేసుకుపోయింది. ఫిబ్రవరి 11 జరిగిన అండర్-19 వర్లల్డ్ కప్ ఫైనల్‍లో మన కుర్రాళ్లను 79 పరుగుల తేడాతో ఓడించింది. ఈ నేపథ్యంలో గత 8 నెలల్లో టీమ్ఇండియాపై ఆస్ట్రేలియా గెలిచిన మూడు ఫైనళ్ల మ్యాచ్ వివరాలను తెలుసుకుందాం.
డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023)
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‍షిప్ (2021-23) ఫైనల్ గతేడాది జరిగింది. ఇందులో టీమ్ఇండియాను ఆసీస్ బలంగా దెబ్బతీసింది. 2023 జులై 7 నుంచి 11వ తేదీ మధ్య ఇంగ్లాండ్ ఓవల్ వేదిక జరిగిందీ తుది పోరు. ఇందులో ఆసీస్ 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అలా టీమ్ ఇండియా ఐసీసీ ట్రోఫీ ఆశలపై నీళ్లు జల్లి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది ఆ జట్టు. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‍లో తొలి ఇన్నింగ్స్‌లో కంగారు జట్టు 469 పరుగులు చేసింది. టీమ్ ఇండియా 296 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 270 పరుగులకే డిక్లేర్ చేసింది. తద్వారా 444 పరుగుల లక్ష్యాన్ని ముందు ఉంచింది. అయితే ఈ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే ఆలౌటై ఓటమిని అందుకుంది. అలా వరసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్‍లో ఓటమిని అందుకుంది.
వన్డే ప్రపంచ కప్ ఫైనల్(ODI World Cup Final 2023 IND VS Aus)
గతేడాది(2023) స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అజేయంగా ఫైనల్ వరకు చేరింది టీమ్ ఇండియా. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఆస్ట్రేలియాతో తలపడింది. అయితే ఈ తుది పోరులో 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడాలన్న భారత్ కలను ఆసీస్ చెరిపివేసింది. ఈ తుదిపోరులో 6 వికెట్ల తేడాతో మనోళ్లు ఓడిపోయారు. అలా ఆరోసారి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను ఎత్తుకెళ్లిపోయింది. మొత్తంగా 2023లో రెండు సార్లు దెబ్బకొట్టింది ఆసీస్.