తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఛాంపియన్స్ ట్రోఫీ కొత్త ట్విస్ట్- టోర్నీ భారత్​కు​ షిఫ్ట్ అయ్యే ఛాన్స్!

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం- చర్చల్లో BCCI పెద్దలు!

Champions Trophy India Hosting
Champions Trophy India Hosting (Source : Getty Images)

By ETV Bharat Sports Team

Published : 5 hours ago

Champions Trophy India Hosting :2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ రోజుకో మలుపు తిరుగుతోంది. చివరికి ఏం జరుగుతుందోనని ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత్‌ పాకిస్థాన్‌కి వెళ్లే అవకాశం లేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి బీసీసీఐ తెలియజేసింది. మారుతున్న పరిస్థితులతో టోర్నమెంట్‌ నిర్వహణే ప్రశ్నార్థకంగా మారింది.

'హైబ్రిడ్‌ మోడల్‌'లో టోర్నీ నిర్వహించే ఉద్దేశం లేదని, భారత్‌ పాక్‌లో అడుగుపెట్టాల్సిందేనని పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (PCB) పేర్కొంది. అంతేకాదు పాకిస్థాన్‌కు రావడానికి భారత్ అంగీకరించకపోవడానికి గల కారణాలపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరుతూ ఐసీసీకి లేఖ రాసింది. హైబ్రిడ్ మోడల్‌కి అంగీకరిస్తే భారత్‌ ఆడే మ్యాచ్‌లు నిర్వహించేందుకు శ్రీలంక, దుబాయ్, దక్షిణాఫ్రికాలో ఒకటి ఎంపిక చేసే అవకాశం ఉంది.

భారత్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ!
పాకిస్థాన్‌ ఇప్పటికే హైబ్రిడ్‌ మోడల్‌ ప్రతిపాదన కొట్టిపారేసింది. అవసరమైతే టోర్నీ నుంచి బయటికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలిసింది. పాకిస్థాన్ ఇదే కఠిన వైఖరిని కొనసాగిస్తే బీసీసీఐ టోర్నీ బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత్‌లో నిర్వహించడంపై బీసీసీఐ వర్గాల్లో చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇంకా ఏదీ ఖరారు కాలేదని తెలిసింది.

ఈ మార్పులతో పాకిస్థాన్‌ టోర్నీ నుంచి బయటకు వెళ్తే ఐసీసీకి భారీ నష్టం తప్పదు. టోర్నీలో హైవోల్టేజ్‌ మ్యాచ్‌ భారత్‌- పాక్‌ ఫైట్ ఉండదు. టోర్నీ మొత్తంలో అత్యధికంగా ఈ మ్యాచ్​నే ప్రత్యక్షంగా, పరోక్షంగా ​వీక్షిస్తారు. దీంతో ఐసీసీ బ్రాడ్‌కాస్టర్లకు భారీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఐసీసీ మరింత చురుగ్గా వ్యవహరించే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు.

టోఫ్రీ టూర్​కు పాక్ ప్లాన్స్
అయితే టోర్నీ నిర్వహణపై సందిగ్ధం కొనసాగుతుండగానే, పాకిస్థాన్ ముందడుగు వేసింది. నవంబర్ 16న ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ ప్రారంభం కానుందని పీసీబీ వెల్లడించింది. ఇస్లామాబాగ్ నుంచి స్కార్దూ మీదుగా ముర్రే, హుంజా, ముజఫ్పరాబాద్​ వరకూ ట్రోఫీ టూర్ ఉండనున్నట్లు పీసీబీ పేర్కొంది. అలాగే ఐసీసీ ఓ ప్రోమోను విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోతో పాకిస్థాన్‌లోనే టోర్నీ జరుగుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే సదరు వీడియో మాత్రం ఐసీసీ సోషల్ మీడియాలో కనిపించడం లేదు. దీంతో మరోసారి టోర్నీ చర్చనీయాంశంగా మారింది.

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించకపోతే PCBకి కలిగే నష్టం ఎంతంటే?

భారత్ లేకుండా ICC టోర్నీయే లేదు- రికార్డులు చూస్తే ఔను అనాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details