PV Sindhu Paris Olympics 2024:భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతోంది. గత రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధు, హ్యాట్రిక్ మెడల్‌పై గురి పెట్టింది. గతంలో రజతం, కాంస్యంతో సరిపెట్టుకున్న సింధు ఈసారి ఎలాగైనా పసిడి పట్టేయాలనే కసితో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో భారత్ తరఫున వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడంపై సింధు మాట్లాడింది. పారిస్ ఒలింపిక్స్‌లో 200 శాతం శ్రమించి ప్రత్యర్థులను ఆలౌట్ చేసి స్వర్ణం పట్టేస్తానని పేర్కొంది.
'బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాను. ఈ పోటీల్లో 200శాతం శ్రమించి మంచి ప్రదర్శన చేస్తాను. అయితే ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ మెడల్ సాధించడం అంత ఈజీ కాదు. అక్కడ విపరీతమైన పోటీ ఉంటుంది. ప్రత్యర్థులు కూడా ప్లాన్ ప్రకారం ఆడతారు. ఒక్కో పాయింట్ కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. చిన్న తప్పిదాలు ఫలితాన్నే మార్చేస్తాయి. కానీ, దేశం ఆశలను నెరవేరుస్తా. నా దృష్టి మొత్తం స్వర్ణ పతకం సాధించడంపైనే ఉంటుంది' అని సింధు పేర్కొంది.
గతంలో రెండు పతకాలు: అయితే సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్ ఈవెంట్లో ఇప్పటికే రెండు పతకాలు సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని ముద్దాడింది. ఇక పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అటు భారత్ అభిమానులు కూడా సింధుపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. గతంలో కంటే ఈసారి భారత్ పతకాల సంఖ్య పెరగాలని ఆశిస్తున్నారు.